బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి..

గరిడేపల్లి, ఆంధ్రప్రభ : మైనర్ బాలికపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడిన బండి భగీరథను తక్షణమే అరెస్టు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్రామ చౌరస్తాలో మహిళలు, ప్రజా సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాళ్లు రామలింగమ్మ, గంగారపు సైదమ్మలు పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడైన బండి భగీరథ ఒక సామాన్య మైనర్ బాలికపై ఇంతటి దారుణానికి ఒడిగట్టి వారం రోజులు గడుస్తున్నా, నేటికీ పోలీసులు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం, అరెస్టు చేయకపోవడం అత్యంత దుర్మార్గమైన విషయమని వారు మండిపడ్డారు.

బాధితులకు అండగా నిలవాల్సిన చట్టం, అధికార బలమున్న వారి ముందు మోకరిల్లడం చూస్తుంటే “చట్టం ఉన్నవాడికి చుట్టం” అనే సామెత నిజమవుతోందని ఆరోపించారు. అధికార పీఠాలపై ఉంటూ తప్పులను కప్పిపుచ్చుతారా? ఆర్థిక బలం, రాజకీయ పలుకుబడి ఉన్నవారు తప్పు చేస్తే ఒక న్యాయం, సామాన్యులు తప్పు చేస్తే ఒక న్యాయమా? అని వారు నిలదీశారు. ఈ దారుణానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తప్పు చేసిన తన కుమారుడిని చట్టానికి అప్పగించి ఆదర్శంగా నిలవాల్సింది పోయి, తన హోదాను, అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిందితుడు తప్పించుకు తిరిగేలా చేయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని అన్నారు.

అత్యాచారానికి గురై మానసికంగా, శారీరకంగా కుంగిపోయిన మైనర్ బాలిక కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి, అధికార పక్ష బలంతో వారిపై, వారి కుటుంబ సభ్యులపై స్థానికంగా అనేక రకాలుగా ఒత్తిళ్లు తెస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని, నిందితుడిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని, లేనిపక్షంలో ఈ ఆందోళనలను జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.మహిళా సంఘాల పిలుపుతో గ్రామంలోని మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ నిరసనకు మద్దతు తెలిపారు. ప్రగతిశీల మహిళా సంఘం గ్రామ నాయకురాళ్లు నాగమణి, సుశీల, వెంకటమ్మ, ఎల్లమ్మ, ఇందిరా, హసిత, మంగమ్మ, లక్ష్మి, జానకమ్మ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.