జంపన్న వాగులో భక్తుడు గల్లంతు
తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగులో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో వాగులోకి దిగిన ఓ భక్తుడు గల్లంతయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
నార్లపూర్ ఇన్‌చార్జి ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తిమ్మయ్య (20) నలుగురు స్నేహితులతో కలిసి సమ్మక్క–సారలమ్మ వనదేవతల దర్శనం కోసం మేడారానికి వచ్చాడు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జంపన్న వాగులో వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో, వాగులోకి దిగవద్దని అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా తిమ్మయ్య కొంత దూరం వెళ్లి పుణ్యస్నానం కోసం వాగులోకి దిగాడు.
ఈ సమయంలో ఒక్కసారిగా వరద ప్రవాహం ఉద్ధృతం కావడంతో తిమ్మయ్య నీటిలో కొట్టుకుపోయాడు. దీంతో అతని స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
స్థలానికి చేరుకున్న ఎస్సై నరేష్ ఆధ్వర్యంలోని బృందం గాలింపు చర్యలు ప్రారంభించింది. అయితే సాయంత్రం వరకు తిమ్మయ్య ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. అతని తండ్రి రంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
