ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహనా వారోత్సవాలు..

ఏలూరు, ఆంధ్రప్రభ : ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జులై 11 నుండి 18వ తేదీ వరకు ఏలూరు జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.యు.శోభ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భముగా ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుండి డి.ఎం.హెచ్.ఒ. డా.శోభ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డా. శోభమాట్లాడుతూ, ఈ సంవత్సరపు ప్రపంచ జనాభా దినోత్సవ థీమ్ “పిల్లల మధ్య సరైన దూరం తల్లుల, బిడ్డల ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సుకు పునాది” అన్నారు. అలాగే ఈ ఏడాది నినాదం “పిల్లల మధ్య ఎడం పాటిద్దాం ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం” అని తెలిపారు.

ఈ వారోత్సవాల ప్రధాన లక్ష్యం గర్భధారణల మధ్య తగిన వ్యవధి పాటించడం, తల్లి, శిశు మరణాలను తగ్గించడం, తాత్కాలిక కుటుంబ నియంత్రణ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ఆధునిక తాత్కాలిక గర్భనిరోధక పద్ధతుల వినియోగాన్ని ప్రోత్సహించడం, అనాలోచిత గర్భధారణలను నివారించడం అని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య, వెల్నెస్ కేంద్రాలలో కుటుంబ నియంత్రణ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ముఖ్యంగా పి.పి.ఐ.యు.సి. డి, అంతరా ఇంజెక్షన్, కాపర్-టి వంటి తాత్కాలిక గర్భనిరోధక పద్ధతులు, పురుషుల శాశ్వత కుటుంబ నియంత్రణ (వాసెక్టమీ), మహిళల కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమీ) వంటి శస్త్ర చికిత్సలు తదితర సేవలను ప్రజలు వినియోగించుకోవచ్చునని తెలియజేసారు. ప్రపంచ జనాభా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జిల్లా, మండల స్థాయిలో అవగాహన సదస్సులు, ర్యాలీలు, ఐఈసీ కార్యక్రమాలు, గ్రామ సభలు, డిజిటల్ ప్రచారకార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పంచాయతీరాజ్ సంస్థలు, మహిళా సంఘాలు, ఐసీడీఎస్, ఆశా కార్యకర్తలు ఇతర శాఖల సహకారంతో విస్తృత ప్రచారం చేపడుతున్నామని తెలిపారు.

ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో కుటుంబ నియంత్రణ సేవలను స్వీకరించిన అర్హులైన లబ్దిదారులకు, అలాగే ఉత్తమ సేవలు అందించిన వైద్యులు, సిబ్బంది, పి పి ఐ యు సి డిలను ప్రోత్సహించిన ప్రోత్సాహకులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక నగదు బహుమతులను ఇవ్వనున్నట్లు తెలియజేసారు. ఈ నగదు ప్రోత్సాహకాలను ప్రత్యేకంగా లక్కీ డిప్ ఏర్పాటుచేసి విజేతలను జిల్లా కలెక్టర్ ద్వారా ప్రకటించడం జరుగుతుందని తెలియ జేసారు. ప్రజలందరూ ప్రభుత్వ ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.యు.శోభ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా.నరేంద్ర, డా. రోహిత్, డెమో శ్రీనివాస్, డి.పి.హెచ్.ఎన్.ఓ. జ్యోతి, ఎ.ఎం.ఓ. గోవింద రావు, ఇతరఆరోగ్య సిబ్బంది, ఎ.ఎన్.ఎం.లు ఆశ కార్య కర్తలు, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు.