ప్రపంచ పర్యాటక రంగంగా భువనగిరి కోట
అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
పనుల జాప్యం పై అసహనం
రూ. 56.81 కోట్లు మంజూరు
మంత్రి జూపల్లి కృష్ణా రావ్ సమీక్ష
ఆంధ్రప్రభ ప్రతినిధి, యాదాద్రి: భువనగిరి కోట పర్యాటక అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కోట క్రింద రోప్‌వే, హోటల్ నిర్మాణం, పార్కింగ్, రెస్ట్‌రూమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, రాక్ గార్డెన్ విద్యుత్ దీపాల అలంకరణ వంటి పనులతో పాటు, కొండపైన కోట పునరుద్ధరణ, కేఫేటీరియా, ఇంటర్ప్రిటేషన్ సెంటర్, మెట్ల పునరుద్ధరణ, ఎంట్రన్స్ ప్లాజా, టికెట్ కౌంటర్, వెయిటింగ్ లాంజ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా పనుల్లో జరిగిన జాప్యంపై మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ, అక్టోబర్ 2 నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే పగలు-రాత్రి పనులు కొనసాగించాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గతంలో పర్యాటక రంగం నిర్లక్ష్యం చెయ్యబడిందని, ప్రస్తుతం నూతన విధానాలతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యమని తెలిపారు. యాదాద్రిలో భువనగిరి కోట, కొలనుపాకలను అనుసంధానిస్తూ సమగ్ర పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి జరుగుతోందన్నారు.
ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా భువనగిరి…
స్వదేశ్ దర్శన్ స్కీమ్ 2.0 కింద రూ. 56.81 కోట్ల వ్యయంతో భువనగిరి కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి జూపల్లి తెలిపారు. రోప్‌వే ఏర్పాటు, ఆధునిక సదుపాయాల కల్పనతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలు నెలకు కనీసం రెండు సార్లు పర్యాటక ప్రాంతాలను సందర్శించి తెలంగాణ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని మంత్రి కోరారు.
అభివృద్ధి లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
-ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
అభివృద్ధి పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రోప్‌వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ గౌతమి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావ్, పురావస్తు శాఖ డైరెక్టర్ డా. అర్జున రావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మెన్ తంగళ్లపల్లి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
