బైకును ఇసుక ట్రాక్టర్ ఢీ. ..
బైకును ఇసుక ట్రాక్టర్ ఢీ. ..
వ్యకికి గాయాలు, హైదరాబాద్‌కు తరలింపు
తాండూరు, ఆంధ్రప్రభ : ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బైకును ఢీ కొట్టింది. బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ సంఘటన ఆదివారం యాలాల మండలం దౌలాపూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు కాగ్నానది నుంచి కోడంగల్ వైపు ఓ ట్రాక్టర్ ఇసుకను తరలిస్తోంది. అతివేగంగా వెళుతున్న ట్రాక్టర్ ముందు టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో అదుపు తప్పింది.
అదే సమయంలో కోడంగల్ వైపు నుంచి తాండూరు వైపు బైకుపై ఉన్న మోహిజ్ అనే ప్రయాణికుడి మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో బైకుపై ఉన్న మోహిజ్ రెండు కాళ్లు విరిగిపోయి.. తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మోహిద్‌ను వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఈ మేరకు అతన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.


