ఆలయంలో అయ్యగారు ఎక్కడ..?
ఆలయంలో అయ్యగారు ఎక్కడ..?
అర్చకుల కోసం గంటల తరబడి భక్తుల నిరీక్షణ
అందుబాటులో లేని అధికారులు.. ప్రశ్నార్థకంగా మారిన ఆలయ నిర్వహణ
మహాదేవపూర్, (ఆంధ్రప్రభ):
దక్షిణ అరణ్య శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వామివారి దర్శనం, అభిషేకాల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఆలయంలో అర్చకుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం ఆలయ ద్వారాలు తెరిచిన తర్వాత కూడా గర్భగుడిలో విధులు నిర్వహించాల్సిన అర్చకులు సమయానికి అందుబాటులో ఉండడం లేదని భక్తులు చెబుతున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాల కోసం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు సైతం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. కొందరు భక్తులు వెంట తెచ్చుకున్న పూజా సామగ్రిని సమర్పించి అభిషేకాలు చేయించుకోకుండానే వెనుదిరుగుతున్నారని పేర్కొంటున్నారు.
వీఐపీలకే ప్రాధాన్యమా..?
సాధారణ భక్తుల కంటే పైరవీలతో వచ్చే వీఐపీ భక్తులకు అధిక ప్రాధాన్యం లభిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గజస్థంభం వద్ద ప్రత్యేక భక్తుల కోసం వేచి ఉండే పరిస్థితి కనిపిస్తుండగా, టికెట్లు తీసుకున్న సాధారణ భక్తులు మాత్రం దర్శనం కోసం ఎదురుచూడాల్సి వస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.
గర్భాలయంలో అవ్యవస్థ
ప్రధాన గర్భాలయంలో భక్తుల రద్దీ నియంత్రణకు తగిన ఏర్పాట్లు లేకపోవడంతో తోపులాటలు, గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని భక్తులు చెబుతున్నారు. అభిషేకాలు జరుగుతున్న సమయంలో ధర్మదర్శనం కోసం వచ్చిన వారికి స్వామివారి దర్శనం సరిగా లభించడం లేదని వాపోతున్నారు. భక్తులను క్రమబద్ధీకరించేందుకు అవసరమైన సిబ్బంది అందుబాటులో లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోందని అంటున్నారు.
ఈవో పర్యవేక్షణపై ప్రశ్నలు
ఆలయ పరిపాలనను పర్యవేక్షించాల్సిన కార్యనిర్వాహణ అధికారి (ఈవో) భక్తులకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యలు, ఫిర్యాదులతో కార్యాలయానికి వెళ్లిన భక్తులకు తగిన స్పందన లభించడం లేదని ఆరోపిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో పర్యటించి సమస్యలను తెలుసుకోవాల్సిన అధికారులు కనిపించడం లేదని భక్తులు అంటున్నారు.
పాలకమండలి స్పందించాలంటున్న భక్తులు
దేవస్థాన పాలకమండలి ఆలయ పరిపాలనపై మరింత దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. భక్తుల సమస్యలు పెరుగుతున్నా పరిష్కార చర్యలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేవాదాయ శాఖ జోక్యం చేసుకోవాలన్న డిమాండ్
కాళేశ్వర క్షేత్రానికి వచ్చే భక్తులకు సమయానికి అర్చకుల సేవలు, క్రమబద్ధమైన దర్శన ఏర్పాట్లు, పారదర్శక పరిపాలన కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఆలయంలో నెలకొన్న పరిస్థితులపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలయంలో నెలకొన్న సమస్యలపై వివరణ కోసం కార్యనిర్వాహణ అధికారి (ఈవో)ను చరవాణి ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించలేదు. పలుమార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.
