Dandepalli | దర్యాప్తు ముసుగులో రాజకీయ కక్ష సాధింపు
Dandepalli | దర్యాప్తు ముసుగులో రాజకీయ కక్ష సాధింపు
Dandepalli | దండేపల్లి, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు (కెసిఆర్) సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు పేరుతో రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. పార్టీ పిలుపుమేరకు దండేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సిట్ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రజల కోసం ఉద్యమించి తెలంగాణ సాధించిన నాయకుడిపై కక్షపూరితంగా కేసులు బనాయిస్తున్నారని నేతలు విమర్శించారు. ఫోన్ టాపింగ్ కేసుల పేరిట కేసీఆర్‌ను రాజకీయంగా వేధించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్య స్వరాన్ని అణిచివేయలేరని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రజల తరఫున ప్రశ్నిస్తుండటాన్ని తట్టుకోలేకనే నోటీసులు జారీ చేశారని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. రాజకీయ వేధింపులకు బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమం వద్దకు పోలీసులు చేరుకొని దిష్టిబొమ్మ ను దహనం చేయకుండా తీసిపడేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపిపి పసార్తి అనిల్, నాయకులు, పత్తిపాక శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కల రవీందర్, ఆశెట్టి వెంకట రమణ,కాసనగొట్టు లింగన్న, సీపతి మల్లయ్య, నక్క తిరుపతి ,రమణ, రేణి శ్రీనివాస్, బొమ్మేన మహేష్ తదితరులు పాల్గొన్నారు.
