నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం..
బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : బాసరలోని గోదావరి నది తీరం వద్ద ఓ భక్తుడు మరిచిపోయిన మొబైల్ ఫోన్‌ను హోంగార్డు నిజాయితీగా తిరిగి అప్పగించి ప్రశంసలు అందుకున్నాడు.
జరికోట్ గ్రామానికి చెందిన రాజు శుక్రవారం పుణ్యస్థలాల సందర్శనకు వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన తన మొబైల్ ఫోన్‌ను గోదావరి నది తీరం వద్ద మరిచిపోయి వెళ్లిపోయాడు.
అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డు రవికి ఆ ఫోన్ లభించింది. అనంతరం ఫోన్లోని వివరాలు, మొబైల్ నంబర్ ఆధారంగా యజమానిని గుర్తించి జరికోట్ గ్రామానికి చెందిన రాజుకు రూ.15 వేల విలువైన మొబైల్ ఫోన్‌ను అందజేశారు.
తన మొబైల్ ఫోన్‌ను తిరిగి పొందిన రాజు హోంగార్డు రవికి కృతజ్ఞతలు తెలిపారు. అంకితభావంతో విధులు నిర్వహించి నిజాయితీని చాటిన హోంగార్డు రవితో పాటు ఎన్ఎంఆర్ చంద్ర మోహన్‌ను భక్తులు అభినందించారు.
