సీపీఎస్ రద్దు కోసం మహబూబ్‌నగర్‌లో జన జాగరణ యాత్రకు ఘన స్వాగతం
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలనే డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలు, 119 నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తున్న జన జాగరణ యాత్ర శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలిరావడంతో జిల్లా కేంద్రం ఉద్యమ వేదికగా మారింది.
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది యాత్రకు ఘన స్వాగతం పలికారు. “చలో హైదరాబాద్” నినాదాలతో హోరెత్తిస్తూ ఆగస్టు 23న నిర్వహించనున్న కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొంటామని ప్రకటించారు. వారి నినాదాలు ఉద్యమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.
అనంతరం యాత్రలో పాల్గొన్న నాయకులు, జేఏసీ సంఘాల ప్రతినిధులు స్థానిక అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడి నుంచి బీఆర్ అంబేద్కర్ భవన్ మీదుగా శాంతియుత పాదయాత్ర నిర్వహిస్తూ స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు కురాకుల శ్రీనివాస్, మ్యాన పవన్, మల్లికార్జున్, లక్ష్మీనరసింహరావు పాల్గొన్నారు. వీరికి జిల్లా అధ్యక్షుడు కె.ఎం. చంద్రకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రాఘవేందర్ రెడ్డి, జిల్లా కోశాధికారి రాఘవేంద్రులు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
