బాసరలో ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన..

లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

బాసర, ఆంధ్రప్రభ : బాసరలో కొనసాగుతున్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ శనివారం పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత సైట్ ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.354 కోట్ల అంచనాతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. దాతల సహకారంతో ఆలయ గర్భగుడి, మహాకాళి, దత్తాత్రేయ ఆలయాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఈ పనులన్నీ పుష్కరాల నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అనంతరం గోదావరి నది తీరంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సుమారు 2,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరు తడి పంటలు సాగు చేయాలని, ఎల్‌నీనో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని రైతులకు సూచించారు.

తర్వాత ప్రభుత్వ బాలికల, బాలుర పాఠశాలలను సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ సతీష్‌రావు, బిదరెల్లి సర్పంచ్ విశ్వనాథ్ పటేల్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ రామారావు, బీజేపీ నాయకులు సాయినాథ్, జిడ్డు సుభాష్, అన్నెల రాజేశ్వర్, రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.