ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి వరం

ఊట్కూర్, ఆంధ్రప్రభ: సీఎం సహాయనిధి వివిధ అనారోగ్యాలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు వరంలా నిలుస్తోందని చిన్నపోర్ల సర్పంచ్ గాండ్ల నిఖీత ప్రశాంత్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్ల గ్రామంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో ఐదుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.2 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల వైద్య చికిత్స కోసం సీఎం సహాయనిధి ద్వారా అందిస్తున్న ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంజు, వార్డు సభ్యులు బందే నవాజ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.