నేడు మామిళ్లపల్లిలో ఆధ్యాత్మిక సందడి

నేడు మామిళ్లపల్లిలో ఆధ్యాత్మిక సందడి
- హిందూ సమ్మేళనానికి తరలిరండి
- మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలో మే 13న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మంగళవారం ఒక వీడియో సందేశంలో తెలిపారు. దేశభక్తి, దైవభక్తి భావాలను ప్రజల్లో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో గత సంవత్సరం నుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ క్రమంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి ఆదిత్య పరాశ శ్రీ స్వామిజి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు జరగనుండగా, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. సమయపాలన పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
