ప్రశాంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు: బీఆర్ఎస్

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ అభివృద్ధికి విశేష కృషి చేసిన బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.

శనివారం భీమ్‌గల్ పట్టణంలోని ఎల్‌జే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ నీలం రవి, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు రాము, ఉపాధ్యక్షుడు శీను, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గున్నాల బాలభాగత్, పార్టీ నాయకులు బొదిరె నర్సయ్య, మూత లింబాద్రి తదితరులు మాట్లాడారు.

భీమ్‌గల్‌కు అత్యంత కీలకమైన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారని తెలిపారు. ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టిన ఆందోళనను బలవంతంగా అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ అభివృద్ధి అంశాలపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో రాజకీయంగా ఎదిగిన వ్యక్తి, అదే నాయకత్వంపై విమర్శలు చేయడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్ష నాయకులపై ఆరోపణలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావని అన్నారు. భీమ్‌గల్–బడా భీమ్‌గల్ మధ్య దెబ్బతిన్న వంతెన పనులు, ఇతర పెండింగ్ అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

భూ ఆక్రమణలు, అవినీతి, ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, అవసరమైతే ప్రజల ముందుకు తీసుకువస్తామని హెచ్చరించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో భీమ్‌గల్‌లో సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర గిరి ప్రదక్షిణ మార్గాన్ని అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారని గుర్తు చేశారు.

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలకే పరిమితమైతే కాంగ్రెస్ నాయకుల వైఫల్యాలను ప్రజల ముందు ఎండగడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.