సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

భవానిపురం, ఆంధ్రప్రభ : సమాజసేవే మహోన్నత ఆశయంగా, ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి శని, ఆదివారాల్లో ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శనివారం వన్‌టౌన్‌లోని గాంధీజీ మహిళా కళాశాల ఆవరణలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకున్నారు.

ఈ శిబిరంలో పీవీఆర్ ఆసుపత్రి, శంకర నేత్ర చికిత్సాలయం, వాసన్ ఐ కేర్ వంటి ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని సేవలందించారు. సాధారణ వైద్య పరీక్షలతో పాటు దంత, నేత్ర వైద్య పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్‌రే, రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహాదేవు అప్పాజీరావు, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ సోలంకి రాజు, 37వ డివిజన్ బీజేపీ ఇన్‌చార్జి హరీష్ వ్యాస్, టీడీపీ కోఆర్డినేటర్ పిళ్ల సుదర్శన్, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొని తమ సేవలందించారు.