Visakhapatnam Steel Plant Accident Safety Lapses | విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భద్రతపై మళ్లీ ప్రశ్నలు

Visakhapatnam Steel Plant Accident Safety Lapses| విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భద్రతపై మళ్లీ ప్రశ్నలు

Visakhapatnam Steel Plant Accident Safety Lapses| వరుస ప్రమాదాలతో కార్మికుల్లో ఆందోళన
భద్రతా ప్రమాణాల అమలుపై ఆరోపణలు

ప్రైవేటీకరణ యత్నాల మధ్య నిధుల కొరత
స్టీల్ ప్లాంట్ మనుగడపై పెరుగుతున్న సందేహాలు

Visakhapatnam Steel Plant Accident Safety Lapses| విశాఖ స్టీల్ ప్లాంట్లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం ఎనిమిది మందిని బలితీసుకుంది. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వీరిలో ఎంత మంది సజీవులు అవుతారో చెప్పలేకపోతున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభం నుంచి అనేక అవరోధాలను ఎదుర్కొంటోంది. వీటిలో యాంత్రికమైనవి కొన్ని, యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల మరికొన్ని ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీకి ఐదు దశాబ్దాల పైగా చరిత్ర ఉంది. దీనిని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం సాగిస్తున్న యత్నాలు దీనికి ఒక శాపంలా పరిణమించాయి. ప్రైవేటు పరం వార్తలు వచ్చినప్పుడల్లా ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, స్థానికులు కలిసి ఉద్యమాలు నడపడం, తీవ్రమైన ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గుతూ వస్తోంది.

మొక్కుబడిగా నిధులను కేటాయిస్తోంది. ఈ ఫ్యాక్టరీలో మరణించిన వారి కంటే, తీవ్రమైన గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు నరకయాతన అనుభవిస్తున్నారు. వారికి చికిత్స అందించడం వైద్యులకు కూడా కష్టంగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మానసికంగా వారు ఎంతో తీవ్ర వ్యధతో తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదాలు వరుసగా జరుగుతుండటంతో మానవ తప్పిదాలే కారణం అన్న ఆరోపణలు వస్తున్నాయి.

పదిహేను సంవత్సరాల క్రితం అక్కడ ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమల శాఖ డైరక్టర్ క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమర్పించిన నివేదిక అమలు జరిగి ఉంటే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అయ్యేవి కావని అంటున్నారు. 2012లో ఉక్కును కరిగించే విభాగంలో పేలుడు సంభవించి 19 మంది మరణించారు. స్టీల్ ప్లాంట్లో ఒకప్పుడు 18 వేలకుపైగా శాశ్వత ఉద్యోగులు ఉండేవారు. వారిని ఎలా వదిలించుకోవాలా అనే ఆలోచనతో యాజమాన్యం పావులు కదిపింది. ఉద్యోగుల సంఖ్యను 8,800లకు తగ్గించింది. అప్పటి నుంచి సంభవించిన వివిధ ప్రమాదాల్లో నిపుణులైన కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఉన్న వారిలోనే నైపుణ్యం కలిగిన వారితో ఆయా విభాగాల్లో పనులు జరిపిస్తున్నారు.

ఈ ప్లాంట్ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఉద్యమాలు, ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం ఇటీవల 11 వేల కోట్లను కేటాయించింది. ఆ నిధుల్లో కూడా ముఖ్యమైన భాగాలకు సర్దుబాటు చేయకపోవడం వల్లనే ప్రమాదానికి కారణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ మనుగడకు అవసరమైన నిధులను కేటాయించలేదని ఆరోపిస్తున్నారు. పని ప్రాంతంలో ప్రమాదాలకు తావు లేకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలి. కానీ, యాజమాన్యం ఈ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

2024లో దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రమాదాలు తగిన భద్రతా ప్రమాణాలు చేపట్టకపోవడం వల్ల వందలాది మంది మరణించారు. అయినా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం మొక్కుబడి చర్యలు తీసుకుంటోందనీ, దీనిని నిలబెట్టాలన్న చిత్తశుద్ధి యాజమాన్యానికి లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు సైతం ప్రైవేటీకరణ యత్నాలపై పోరాటంపై దృష్టిపెట్టి, మిగిలిన విషయాలను పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి విశాఖకు క్యూ కడుతున్న నాయకులు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, దీని ప్రమాణాలను పెంచేందుకు తగిన చర్యలు తీసుకునేట్టు చేసి ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం లేదని అంటున్నారు.

Leave a Reply