46Degrees | రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి!
46Degrees | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఎండల తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూర్యుడు తన ప్రచండ రూపాన్ని చూపిస్తూ.. రాష్ట్రాన్ని ఒక నిప్పుల కొలిమిలా మార్చేశాడు. అతి తీవ్రమైన వడగాల్పులు , పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా.. తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ వంటి చాలా జిల్లాలపై ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది.
46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..
రాష్ట్రంలో భానుడి ప్రతాపానికి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ దాటాయి. అతి తీవ్రమైన వేడి గాలులు, గాలిలో తగ్గిన తేమ శాతం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని పల్లిగూడెంలో గత రోజుల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
వడదెబ్బ మరణాలు..
ఈ అతి తీవ్ర వడగాల్పుల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గత రెండు, మూడు రోజుల్లోనే తెలంగాణలో సుమారు 30 మందికి పైగా వడదెబ్బ కారణంగా మరణించినట్లు అంచనా వేస్తున్నారు. వరంగల్ లో కేవలం రెండు రోజుల్లోనే 16 మంది వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లాలో కూడా సుమారు 12 మంది వరకు మరణించారు.
‘రెడ్ అలర్ట్’ జారీ చేసిన జిల్లాలు..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ , తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి.
