UnionEducationMinister | మూల్యాంకన లోపాలకు బాధ్యత వహిస్తా…

UnionEducationMinister | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. సీబీఎస్‌ఈ మూల్యాంకన ప్రక్రియలో తప్పులు జరిగాయని అంగీకరిస్తూ.. ఆ లోపాలకు తానే బాధ్యత వహిస్తున్నానని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
రీ-వాల్యుయేషన్‌కు ఆదేశాలు
సీబీఎస్‌ఈ 12వ తరగతి జవాబు పత్రాల రీ-వాల్యుయేషన్ నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో లోపాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఫలితాల తర్వాత విద్యార్థులు భారీ సంఖ్యలో తమ జవాబు పత్రాల స్కాన్ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 17 లక్షల మంది విద్యార్థుల్లో 4,04,319 మంది రీ-వాల్యుయేషన్, స్కాన్ కాపీల కోసం అప్లై చేసినట్లు సమాచారం.
స్కాన్ కాపీల్లో గందరగోళం
విద్యార్థులకు అందిన జవాబు పత్రాల స్కాన్ కాపీల్లో అనేక సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. కొన్ని పత్రాలు అస్పష్టంగా కనిపించగా.. మరికొంతమందికి వేరే విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మూల్యాంకన విధానంలో వచ్చిన లోపాలను సరిదిద్దేందుకు సీబీఎస్‌ఈ ప్రత్యేక చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు.
