తాను చదివిన పాఠశాలకు ధనుష్ అపూర్వ కానుక
- సొంత ఖర్చుతో మూడు అంతస్తుల భవనం నిర్మాణం..
- ‘ధనుష్ బ్లాక్’గా నామకరణం
- గురువుల పాదాలకు నమస్కరించి కృతజ్ఞత చాటుకున్న స్టార్ హీరో
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సినీ నటుడు ధనుష్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. తన చదువుకున్న పాఠశాలకు అపూర్వమైన కానుక అందించడు. చిన్ననాటి జ్ఞాపకాలను పదిలం చేసుకుంటూ, తాను ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేసిన చెన్నైలోని పాఠశాలకు సొంత ఖర్చుతో ఆధునిక సౌకర్యాలతో కూడిన మూడు అంతస్తుల కాంక్రీట్ భవనాన్ని నిర్మించి అందజేశారు.
పాత పైకప్పు భవనాన్ని తొలగించి నిర్మించిన ఈ నూతన విద్యా భవనానికి ‘ధనుష్ బ్లాక్’ అని పేరు పెట్టారు. బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ధనుష్ స్వయంగా ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు ఆయనతో పాటు 1999 బ్యాచ్ సహపాఠి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కుమారన్, ఆయన సోదరీమణులు కార్తీక దేవి, విమలగీత తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఘట్టం ధనుష్ తన పూర్వ ఉపాధ్యాయుల పట్ల చూపిన గౌరవం. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి ఆత్మీయంగా ముచ్చటించి జ్ఞాపకాలను పంచుకున్నారు. వారితో కలిసి ఫొటోలు దిగుతూ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
ధనుష్‌తో ఎల్‌కేజీ నుంచి ప్లస్ టూ వరకు కలిసి చదివిన సహపాఠి కుమారన్, ఆయన భార్య లక్ష్మీకృప కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పాత అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ధనుష్‌కు ఘన స్వాగతం పలికి ఆయన సేవాభావాన్ని అభినందించారు.
తాను ఎదిగిన పాఠశాలకు తిరిగి ఏదైనా చేయాలన్న ఆలోచనతో ఈ భవనాన్ని నిర్మించినట్లు కార్యక్రమంలో ధనుష్ పేర్కొన్నట్లు సమాచారం. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలన్న ఉద్దేశంతో నిర్మించిన ఈ భవనం భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని పాఠశాల వర్గాలు తెలిపాయి.
ధనుష్ చేసిన ఈ సేవపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయవంతమైన నటుడిగా మాత్రమే కాకుండా, తన మూలాలను మరచిపోని వ్యక్తిగా ఆయన మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందారు.



