స్వ‌ర్ణ‌ధారుడై..

శ్రీ‌శైలంలో విశేష పూజ‌లు

నంద్యాల బ్యూరో నవంబర్ 9 ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం స్వర్ణరథారూఢులైన స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించినట్లు కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయన్నారు .

అనంతరం స్వర్ణరథంపై కొలువై ఉన్న శ్రీస్వామిఅమ్మవార్లకు పూజాదికాలు జరిపించబడ్డాయన్నారు. ఈ పూజాదికాలకు ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణాన్నికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా కార్యక్రమములో పలు కళా బృందాల కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం మొదలైన కళారూపాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయన్నారు. కార్యక్రమములో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, అర్చకస్వాములు, వేదపండితులు, పలువురు శాఖాధిపతులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply