జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు..
అభివృద్ధి పనులపై సమీక్ష
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా పరిషత్ స్థాయి వివిధ సంఘాల సమావేశాలు జూన్ 6న చిత్తూరులోని జిల్లా ప్రజా పరిషత్ నూతన, పాత సమావేశ మందిరాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రవికుమార్ నాయుడు తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్మన్ జి. శ్రీనివాసులు (వాసు) అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు.
నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రణాళిక, ఆర్థిక, పనుల స్థాయి సంఘ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘ సమావేశం, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటి గంట వరకు విద్య, వైద్య ఆరోగ్య స్థాయి సంఘ సమావేశం జరగనుంది.
ఈ మూడు సమావేశాలకు జిల్లా పరిషత్ చైర్మన్ జి. శ్రీనివాసులు అధ్యక్షత వహించగా, జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్ నాయుడు ఇన్‌ఛార్జిగా వ్యవహరించనున్నారు.
అదే రోజు పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు వ్యవసాయ స్థాయి సంఘ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు బి. ధనుంజయ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు.
అనంతరం ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహిళా సంక్షేమం, రక్షణ స్థాయి సంఘ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంఘ చైర్‌పర్సన్ సి.ఆర్. భారతి అధ్యక్షత వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు సామాజిక సంక్షేమ స్థాయి సంఘ సమావేశం నిర్వహించనుండగా, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఆర్. రమ్య అధ్యక్షత వహించనున్నారు.
ఈ సమావేశాలకు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఇన్‌ఛార్జిగా వ్యవహరించనున్నారు.
జిల్లా అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, సామాజిక సంక్షేమం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి, శాఖల వారీగా పురోగతిని సమీక్షించనున్నట్లు సీఈఓ రవికుమార్ నాయుడు తెలిపారు.
సంబంధిత స్థాయి సంఘాల సభ్యులు, అధికారులు తప్పనిసరిగా హాజరై సమావేశాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
