Irrigation Projects | వేల కోట్లు ఖర్చు.. నీళ్లు మాత్రం లేవు
Irrigation Projects | వేల కోట్లు ఖర్చు.. నీళ్లు మాత్రం లేవు
Irrigation Projects | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ రైతులకు ఆశించిన ప్రయోజనం కలగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను పరిశీలించిన అనంతరం మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులు చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, కానీ ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదని విమర్శించారు.
గత ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం అవసరమైన భూములను కూడా పూర్తిగా సేకరించకుండానే పనులు పూర్తయ్యాయని ప్రకటించిందని సీఎం విమర్శించారు. పంపులు, లిఫ్టుల ఏర్పాట్ల పేరుతో భారీ వ్యయాలు జరిగాయని, వాటి వల్ల ప్రజలకు కాకుండా కొందరికి మాత్రమే లాభం చేకూరిందని ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికీ అనేక సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టుల అప్పుల అసలు కింద రూ.41,118 కోట్లు, వడ్డీ రూపంలో రూ.43,385 కోట్లు చెల్లించిందని రేవంత్రెడ్డి వివరించారు. మొత్తంగా రూ.84,503 కోట్ల భారం ప్రజలపై పడిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ అప్పుల భారాన్ని భరిస్తూ కేవలం 30 నెలల్లోనే రూ.33,567 కోట్ల అసలు, రూ.18,554 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చిందన్నారు. మొత్తం రూ.52,120 కోట్లను అప్పుల కింద చెల్లించామని వెల్లడించారు.
