పారదర్శక సేవలతో ప్రజల వద్దకు వెళ్లాలి..

పారదర్శక సేవలతో ప్రజల వద్దకు వెళ్లాలి..

ప్రతి ఇంటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలి

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : సచివాలయ సిబ్బంది పారదర్శకంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రతి లబ్ధిదారుడి ఇంటికే వెళ్లి గౌరవప్రదంగా పెన్షన్లు అందజేయాలని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం చిత్తూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఎన్టీఆర్ భరోసా, వివిధ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ, అక్షరాంధ్ర తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, వయోజన విద్య డీడీ మహమ్మద్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అధికారి ప్రజలకు జవాబుదారిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతి నెల సుమారు రూ.100 కోట్లను ఎన్టీఆర్ భరోసా కింద లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంతృప్తి స్థాయి 90 శాతం ఉండేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.

పెన్షన్లను బహిరంగ ప్రదేశాల్లో పంపిణీ చేయరాదని, ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. పెన్షనర్లతో గౌరవంగా మాట్లాడి చిరునవ్వుతో సేవలు అందించాలని సూచించారు. ప్రతి ఎంపీడీవో గ్రామ సచివాలయ సిబ్బందితో సమీక్షలు నిర్వహించి పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

గత మూడు నెలల పనితీరును డీఆర్‌డీఏ పీడీ ఆధ్వర్యంలో సమీక్షించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి పనితీరు నివేదికలో కొన్ని సచివాలయాలు బాటమ్-20లో ఉన్నాయని పేర్కొంటూ వాటి పనితీరు మెరుగుపర్చాలని ఆదేశించారు.

ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్‌పై సమీక్షలో భాగంగా 567 మందికి కాల్స్ చేయగా 83 శాతం మంది సానుకూల స్పందన ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రతి లబ్ధిదారుడి మొబైల్ నంబర్‌ను ధృవీకరించి మూడు–నాలుగు రోజుల్లో అప్డేట్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు సమర్పించే నివేదికలు ఖచ్చితంగా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. పనితీరు తక్కువగా ఉండటం కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

అలాగే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరిచే కార్యక్రమాలు డీపీఓ పర్యవేక్షణలో చేపట్టాలని ఆదేశించారు.