Devotional | తిరుమలలో గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు ఆరంభం

తిరుపతి ప్రతినిధి – ఆంధ్రప్రభ, 900 ఏళ్ల చరిత్రకు మరువలేని, మరుపురాని చిహ్నం గోవింద రాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి.తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోని ఆలయాల్లో ఏడాది పొడవునా, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు సాగుతూ ఉంటాయి.తిరుపతిలో శ్రీగోవింద రాజస్వామి బ్రహ్మోత్సవా లు సోమవారం ఉదయం 07.02 గంటలు నుంచి – 07.20 గంటల మధ్య మిథున లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి.

వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు.ఈ వేదపండితులు ఈ వేడుకను నిర్వహిస్తుండగా, పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి పర్యవేక్షించారు. అంతకు ముందు శ్రీగోవింద రాజస్వామి , ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడవీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపులో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గోవింద రాజుల స్వామి ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తు హోమం, గరుడ లింగ హోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం చేసిన పుణ్యంతో సాటిరాదని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకే గరుడపటాన్ని ఎగురవేస్తారు.

భారీ ఏర్పాట్లతో బ్రహ్మోత్సవాలకు అంకురం

శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. మూలవిరాట్ సహా వాహనసేవలను భక్తులు సంతృప్తిగా దర్శించుకునేందుకు వీలుగా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధానంగా జూన్ ఆరో తేదీన గరుడ వాహనం, జూన్ 9న రథోత్సవం, జూన్ 10న చక్రస్నానం జరుగనున్నాయి. వాహన సేవల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకునేలా చర్యలు చేపట్టారు. వాహన సేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా రైల్వేస్టేషన్, విష్ణు నివాసం, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాల్లో డిజిటల్ స్క్రీన్లు (ఎల్ఈడి)లు ఏర్పాటు చేశారు. ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. క్యూల క్రమబద్ధీకరణ కోసం తగినంత మంది శ్రీవారి సేవకులను కేటాయించారు.

భక్తులకు అన్నప్రసాదాలు, వాహన సేవల్లో మజ్జిగ, తాగునీరు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వాహన సేవల ముందు ఆకట్టుకునేలా నిపుణులైన కళాకారులతో భజనలు, కోలాటాలు, ఇతర సాంస్క తిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో తొలి రోజు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కల్యాణమండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహన సేవ జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు రాత్రి 07 గంటల నుండి 9.00 గంటల వరకు పెద్ద శేషవాహనంపై స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు.


పెద్ద శేష వాహనం విశిష్టత
పెద్ద శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. వాహనరూపంలో శ్రీగోవిందరాజ స్వామిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి ‘శేషశాయి’ అనే పేరును సార్థకం చేస్తున్నాడు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామి ప్రబోధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో వీఆర్. శాంతి , ఏఈవో కె.ముని కృష్ణారెడ్డి , శ్రీవారి సేవకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply