మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల భరోసా

మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల భరోసా
- తిరుపతి జిల్లాలో 3,099 మంది మత్స్యకారులకు రూ.6.19 కోట్ల డీబీటీ జమ
- చేపల వేట నిషేధ కాలంలో జీవనోపాధికి ప్రభుత్వ అండ
- మత్స్యకారుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి అనగాని
- తమిళనాడు బోట్ల అక్రమ ప్రవేశాల అరికట్టేందుకు హైస్పీడ్ బోట్లు
- ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి సమన్వయ సమావేశాలు
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : చేపల వేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం “మత్స్యకార సేవలో” పథకం ద్వారా రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం నెల్లూరు జిల్లా తుమ్మలపెంట నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించగా, తిరుపతి కలెక్టరేట్ నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2026-27 సంవత్సరానికి సంబంధించి తిరుపతి జిల్లాలో 3,099 మంది మత్స్యకారులకు మొత్తం రూ.6.19 కోట్లను డీబీటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అమలు చేసే 61 రోజుల చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ఈ సాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించామని, గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాల్లో జాబితాలను ప్రదర్శించామని మంత్రి చెప్పారు. వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో బోట్లు, సిబ్బంది లెక్కింపు చేపట్టి అర్హులైన వారిని గుర్తించామని తెలిపారు. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, నెట్లు, మోటార్లు, ఎరేటర్లు వంటి పరికరాలను సబ్సిడీపై అందిస్తున్నామని వెల్లడించారు.

జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోందన్నారు. తమిళనాడు నుంచి అక్రమంగా వచ్చే బోట్లను అరికట్టేందుకు హైస్పీడ్ బోట్లు మంజూరు చేశామని, మెరైన్ పోలీసులతో కలిసి ప్రత్యేక గస్తీ నిర్వహించనున్నట్లు తెలిపారు. పుడిరాయ్ సమస్య పరిష్కారంతో పాటు రూ.24 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. అక్రమంగా ప్రవేశించే బోట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, స్థానిక మత్స్యకారులతో కలిసి మెరైన్ పోలీసులు రెండు షిఫ్టుల్లో గస్తీ నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, అధికారులు, మత్స్యశాఖ సిబ్బంది, మత్స్యకారులు పాల్గొన్నారు.

