నాణ్యతతో వేగవంతంగా పనులు చేయాలి..

నాణ్యతతో వేగవంతంగా పనులు చేయాలి..

  • నార్లాపూర్ ప్యాకేజీ–2, ప్యాకేజీ–3 కాలువల నిర్మాణ పనులను
  • పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ప్యాకేజీ–2, ప్యాకేజీ–3 కాలువల నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నార్లాపూర్ రిజర్వాయర్ డెలివరీ సిస్టంను కూడా ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి ముఖ్యమంత్రితో కలిసి కాలువల నిర్మాణ పనులను సందర్శించి, పనుల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.


మంత్రి జూపల్లి నివాసంలో సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సమీక్ష కోసం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించారు.

గురువారం రాత్రి సోమశిల వద్ద గెస్ట్‌హౌస్‌లో బస చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకాటి శ్రీహరి ఉదయం కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసానికి చేరుకున్నారు. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు, మొక్కలు అందజేసి, శాలువాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు.

మంత్రి నివాసంలో అల్పాహారం తీసుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులతో కరచాలనం చేస్తూ మాట్లాడారు. కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు.