పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

పెడన, ఆంధ్రప్రభ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో ఘనంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తోటమూల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పెడన పట్టణ మున్సిపల్ కార్యాలయం వరకు ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే స్వయంగా సైకిల్ తొక్కుతూ పర్యావరణ చైతన్యాన్ని రగిలించారు.

అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెడన పట్టణంలోని బంగ్లా స్కూల్ వద్ద ప్రత్యేకంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వహస్తాలతో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… మన నియోజకవర్గాన్ని “స్వచ్ఛ హరిత పెడన”గా మారుద్దామని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారానే భవిష్యత్ తరాలకు వెలుగునివ్వగలమని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని పేర్కొన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని, గాలిని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటడమే కాకుండా, వాటిని చెట్లుగా మారేంతవరకు సంరక్షించాలని కోరారు.

ఈ సైకిల్ ర్యాలీ మరియు మొక్కలు నాటే కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యువత పాల్గొని విజయవంతం చేశారు.