కాలిన ట్రాన్స్‌ఫార్మర్లను త్వరగా రైతులకు అందించాలి

మరిపెడ, ఆంధ్రప్రభ: కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మతులు చేసి రైతులకు త్వరితగతిన అందించాలని వరంగల్ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్) మధుసూదన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మరిపెడ మండల కేంద్రంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ, కాలిన ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే మరమ్మతులు చేసి రైతులకు అందించాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్ల రవాణాకు ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా విద్యుత్ శాఖ వాహనాల ద్వారానే తరలించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్) రాజు చౌహన్, తొర్రూర్ ఎస్‌పీఎం, ఏఈ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.