ప్రేమ పేరుతో ట్రాన్స్‌జెండర్ని మోసం చేసి..
ప్రేమ పేరుతో ట్రాన్స్‌జెండర్ని మోసం చేసి..
కర్నూలు, ఆంధ్రప్రభ : ప్రేమ పేరుతో ఓ ట్రాన్స్‌జెండర్‌ను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేశాడని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన ట్రాన్స్‌జెండర్ గీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. బాధితురాలి వివరాల ప్రకారం, చిన్నటేకూరు గ్రామానికి చెందిన పరశురాం అనే వ్యక్తితో 2024 సంవత్సరం నుంచి పరిచయం ఏర్పడింది. పరిచయం క్రమంగా స్నేహంగా మారి, అనంతరం ప్రేమగా మారిందని ఆమె తెలిపింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహితంగా మెలిగాడని గీత ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మకాన్ని కల్పించి, వివిధ అవసరాల పేరుతో తన వద్ద నుంచి దశలవారీగా సుమారు రూ.22 లక్షలు తీసుకున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే.. ఇటీవల అతని ప్రవర్తన మారిపోయిందని, డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే అసభ్యకరంగా దూషిస్తూ బెదిరింపులకు దిగుతున్నాడని ఆమె తెలిపింది. అంతే కాకుండా తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి తనను చంపేస్తామని కూడా బెదిరిస్తున్నాడని గీత పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ తగిన రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె అధికారులను కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఘటన పై దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
