Delhi | నలుగురు ఉగ్ర అనుమానితుల అరెస్ట్

Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురు పంజాబ్‌కు, ఒకరు ఢిల్లీకి చెందినవారని తెలిపారు.

దర్యాప్తులో భాగంగా నిందితులు ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లు, ప్రార్థనా స్థలాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రెండు విదేశీ పిస్టల్స్, తొమ్మిది తూటాలు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక విచారణలో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాల సరఫరా జరుగుతున్నట్లు కీలక సమాచారం లభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఇతర కోణాలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.