Chicken Prices | నాన్‌వెజ్ ప్రియులకు షాక్
Chicken Prices | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరగడంతో నాన్‌వెజ్ ప్రియులకు షాక్ తగిలింది. గత రెండు వారాల వ్యవధిలోనే ధరలు గణనీయంగా పెరగడంతో మార్కెట్లలో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలతో పోలిస్తే కిలోకు రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగాయి. ప్రస్తుతం స్కిన్‌తో కూడిన బ్రాయిలర్ చికెన్ కిలో రూ.290కు విక్రయిస్తుండగా, స్కిన్లెస్ చికెన్ కిలో రూ.320 పలుకుతోంది. బోన్‌లెస్ చికెన్ ధర కిలోకు రూ.380 నుంచి రూ.400 వరకు చేరింది. దీంతో వారానికి ఒకసారి చికెన్ కొనుగోలు చేసే కుటుంబాలు ఇప్పుడు నెలకు ఒకసారి మాత్రమే కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.
ఇదే సమయంలో కోడిగుడ్ల ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో ఒక్క గుడ్డు రూ.7.50 ఉండగా, రిటైల్‌లో రూ.8 వరకు విక్రయిస్తున్నారు. దీంతో పది గుడ్ల ధర రూ.80 దాటింది. వేసవి ప్రభావంతో కోళ్ల ఉత్పత్తి తగ్గడం, కోళ్ల దాణా ధరలు పెరగడం వల్లే గుడ్ల ధరలు పెరిగాయని పౌల్ట్రీ వ్యాపారులు పేర్కొంటున్నారు.
పౌల్ట్రీ వ్యాపారుల వివరాల ప్రకారం.. వర్షాకాల ప్రభావంతో కోళ్ల ఉత్పత్తి తగ్గడం, కోళ్ల దాణా ధరలు పెరగడం, రవాణా ఖర్చులు అధికమవడం వల్ల చికెన్, గుడ్ల ధరలు పెరిగాయి. మార్కెట్లో సరఫరా తగ్గి, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు మరింత ఎగబాకుతున్నాయని చెబుతున్నారు.
ధరల పెరుగుదల ప్రభావం అమ్మకాలపైనా పడింది. గతంతో పోలిస్తే చికెన్ విక్రయాలు దాదాపు 30 శాతం తగ్గినట్లు వ్యాపారులు వెల్లడిస్తున్నారు. కొందరు వినియోగదారులు చికెన్ కొనుగోళ్లను తగ్గిస్తుండగా, మరికొందరు ప్రత్యామ్నాయ ఆహారాల వైపు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే మరో రెండు నెలల పాటు ధరలు అధికంగానే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
