What Next | నెక్స్టేంటీ..!!?

  • యువ‌త గ‌ర్జ‌న.. పెద్దోళ్ల‌ల్లో వ‌ణుకు
  • రిజ‌ర్వేఫ‌న్ హ‌ఠావో, పెట్రోల్లో ఈ20
  • త‌క్ష‌ణ స్పంద‌న‌.. అదే యూత్ టార్గెట్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోలకే పరిమితమైన యువ‌త‌.. రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలను అంత‌గా ప‌ట్టించుకోదులే అనే అభిప్రాయం ఉండేది. అయితే, ఇటీవల దేశంలో చోటుచేసుకున్న పరిణామాలు ఆ అభిప్రాయాన్ని మార్చేస్తున్నాయి. ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం.. యువతలో కొత్త చైతన్యానికి నాంది పలికిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒక పరీక్ష నిర్వహణలో లోపాలపై మొదలైన నిరసనలు క్రమంగా విద్యా విధానం, ప్రభుత్వ నిర్ణయాలు, పారదర్శకత, బాధ్యత వంటి అంశాలపై చర్చకు దారి తీశాయి. నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖలో మార్పులు చోటుచేసుకున్నాయి. యువత నిరసనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆ శాఖ అదనపు బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. దీంతో నేటి యువత కేవలం సోషల్ మీడియాలో సమయం గడిపే తరం మాత్రమే కాదని, అవసరమైతే ప్రజా సమస్యలపై స్పందించి, ప్రభుత్వాలను ప్రశ్నించే శక్తిగా కూడా ఎదుగుతోందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.

అయితే, యువత కేవలం నీట్ పరీక్షకే పరిమితం కాకుండా, దేశంలో తీసుకునే కీలక నిర్ణయాలపై ప్రశ్నలు సంధిస్తూ తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తోంది. ఈ మార్పులో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు వినోదానికి మాత్రమే ఉపయోగపడిన వేదికలు ఇప్పుడు చర్చలు, విశ్లేషణలు, నిరసనలు, ప్రజాభిప్రాయాల వ్యక్తీకరణకు ప్రధాన వేదికలుగా మారాయి……

ఒక విజయమే ధైర్యాన్ని పెంచిందా?

నీట్ పరీక్ష వ్యవహారంపై దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల ఉద్యమం తర్వాత యువతలో కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఒక సమస్యపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఏకమై స్పందిస్తే ప్రభుత్వం కూడా స్పందించాల్సి వస్తుందనే భావన యువతలో బలపడింది. సామాజిక మాధ్యమాల్లో ప్రారంభమైన చర్చలు భారీ నిరసనలకు దారి తీయడం, స్థానిక సమస్యలు జాతీయ చర్చగా మారాయి. దీంతో తమ గొంతును సమర్థంగా వినిపించగలం అనే నమ్మకం యువతలో పెరిగిన‌ట్టు కనిపిస్తోంది. ప్రజా విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలు, సామాజిక అంశాలపై గతంతో పోలిస్తే యువత మరింత చురుకుగా స్పందిస్తోంది.

నీట్ అంశం తర్వాత సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు వస్తున్న అంశాల్లో రిజర్వేషన్ విధానం ఒకటిగా నిలిచింది. రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు అవసరమా?, మెరిట్‌కు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి?, ఆర్థిక ప్రమాణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలా? వంటి ప్రశ్నలపై వేలాది పోస్టులు, వీడియోలతో చర్చలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో “Reservation Hatao Andolan” పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రచారం కూడా కొనసాగుతోంది. అయితే ఈ ప్రచారం ఏ స్థాయిలో ప్రజా మద్దతు పొందుతోంది, దాని వెనుక ఎవరు ఉన్నారు, అధికారికంగా ఏదైనా సంస్థ లేదా వేదిక దీనిని నిర్వహిస్తోందా అనే విషయాలపై స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.

డిజిటల్ వేదికలు ఇప్పుడు యువతకు కేవలం వినోద మాధ్యమాలుగా కాకుండా ప్రజా చర్చలు, విధానాలపై అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసే వేదికలుగా మారుతున్నాయి. అదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ప్రతి ప్రచారాన్ని వాస్తవాలు, అధికారిక సమాచారం ఆధారంగా పరిశీలించి స్పందించడం కూడా అంతే అవసరమని యువ‌త గుర్తించాలి.

ఇప్పుడు E20 కూడా చర్చలోకి…

యుత‌వ చ‌ర్య‌లు, చ‌ర్చ‌లు ఇంతటితో ఆగలేదు. ఈ20 ఇంధన విధానం కూడా సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ప్రభుత్వ నిర్ణయాలపై యువత అనుకూల, ప్రతికూల అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ చర్చల్లో చురుగ్గా పాల్గొంటోంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపే ఈ20 విధానంపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వాహనాల పనితీరు, మైలేజీ, ఇంజిన్ నిర్వహణ వ్యయాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ 20కి వ్య‌తిరేకంగా ఈ 20 జ‌న‌తా పార్టీ అనే పార్టీ సోష‌ల్ మీడియాలో జోరందుకుంది.

గతంలో ప్రభుత్వ విధానాలపై పెద్దగా ఆసక్తి చూపని యువత ఇప్పుడు వాటి గురించి సమాచారం సేకరించడం, వీడియోలు చూడటం, భిన్నాభిప్రాయాలను తెలుసుకోవడం, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం వంటి అంశాల్లో మరింత చురుకుగా మారుతోంది. ఒక విధానాన్ని సమర్థించాలా, వ్యతిరేకించాలా అనేది వేరు అయినప్పటికీ, దానిపై స్పందించాలనే ఆసక్తి మాత్రం క్ర‌మంగా యువ‌త‌లో పెరుగుంది.

అదే సమయంలో యువత నిరసన వ్యక్తం చేసే తీరు కూడా మారిపోయింది. ఒకప్పుడు భారీ ర్యాలీలు, సభలు, ధర్నాలు, దీక్షలు ఉద్యమాలకు ప్రధాన సాధనాలుగా ఉండగా, ఇప్పుడు ఒక వైరల్ రీల్, ఒక మీమ్ లేదా ఒక హ్యాష్‌ట్యాగ్ లక్షల మందిని ఒకే అంశంపై చర్చించేలా చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి డిజిటల్ వేదికలు కొత్త తరానికి చర్చా వేదికలుగా మారుతున్నాయి.

అయితే, సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించే సమాచారం అంతా వాస్తవమే అని భావించకూడదని యువ‌త గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ విధానాలు, ప్రజా అంశాలపై చర్చలు జరగడం ప్రజాస్వామ్యానికి సానుకూల పరిణామమే అయినప్పటికీ, నిర్ణయాలకు ముందు అధికారిక సమాచారం, విశ్వసనీయ ఆధారాలను కూడా పరిశీలించడం అవసరమే.. !

భయం తగ్గింది… ప్రశ్నలు పెరిగాయి

కొత్త తరంలో స్పష్టంగా కనిపిస్తున్న మార్పుల్లో ప్రధానమైనది ప్రభుత్వ నిర్ణయాలపై నిర్భయంగా ప్రశ్నించే ధోరణి. పరీక్షల నిర్వహణ, ఉద్యోగ నియామకాలు, విద్యా విధానాలు, ఇంధన విధానాలు లేదా తమ భవిష్యత్తుపై ప్రభావం చూపే ఇతర అంశాలైనా సరే.. వాటిపై అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి యువత ముందుకు వస్తోంది.

ఇది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి మాట్లాడకూడదు అనే భావన కంటే, ప్రజల జీవితాలపై ప్రభావం చూపే నిర్ణయాలపై ప్రశ్నించడం, అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అనే అవగాహన యువతలో పెరుగుతోంది. డిజిటల్ వేదికలు ఈ మార్పుకు మరింత ఊతమిస్తున్నాయి.

ప్రతి హ్యాష్‌ట్యాగ్ ఉద్యమమే కాదు…

అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యే ప్రతి హ్యాష్‌ట్యాగ్ ని దేశవ్యాప్త ఉద్యమంగా భావించకూడదు. కొన్ని అంశాలు నిజంగానే విస్తృత ప్రజా మద్దతు పొందవచ్చు. మరికొన్ని ఆన్‌లైన్ చర్చలకే పరిమితం కావచ్చు. నీట్ పరీక్ష అంశంతో ప్రారంభమైన విద్యార్థుల స్పందన.. ఇప్పుడు విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్, ఈ20 ఇంధన విధానం వంటి విభిన్న ప్రజా విధానాలపై కూడా చర్చించే స్థాయికి చేరింది. ఈ నేప‌థ్యంలో యువ‌త‌ ఏ అంశంపైనా స్పందించే ముందు పూర్తి సమాచారం, రాజ్యాంగపరమైన అంశాలు, అధికారిక వివరాలు, వాస్తవాలను తెలుసుకుని అభిప్రాయం ఏర్పరచుకోవడం అవసరం.

సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం సేకరించడం, చర్చించడం, అభిప్రాయాలు పంచుకోవడం, అవసరమైతే శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేయడం వంటి ధోరణులు కొత్త తరంలో మరింత పెరుగుతున్నాయి. అయితే ఈ చర్చలు ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా, వాస్తవాధారంగా, శాంతియుత పద్ధతుల్లో కొనసాగడం కూడా అంతే ముఖ్యం.