దేశ ప్రగతికి జనగణన గణాంకాలే పునాది

దేశ ప్రగతికి జనగణన గణాంకాలే పునాది

జిల్లాలో పారదర్శకంగా ఇళ్ల జాబితా, గణన ప్రక్రియ
క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : జనగణన–2027 ప్రక్రియకు సంబంధించి జిల్లాలో ఇళ్ల జాబితా, గృహ గణన (హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్) కార్యక్రమం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. దేశ ప్రగతికి, సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు జనగణన గణాంకాలు కీలక పునాది అని ఆయన పేర్కొన్నారు.

గురువారం విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు తాడేపల్లిలో కొనసాగుతున్న ఇళ్ల జాబితా, గృహ గణన ప్రక్రియను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన సిబ్బంది ఇంటింటికీ వెళ్లే సమయంలో ప్రజలు సరైన, పూర్తి వివరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత కచ్చితత్వంతో, దోషరహితంగా డేటా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఈ గణాంకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం వంటి రంగాల్లో భవిష్యత్ ప్రణాళికలకు ఆధారమవుతాయని వివరించారు.

ప్రతి సమాచారం విలువైనదని, ప్రజల సహకారంతోనే సమగ్ర గణాంకాలు సిద్ధమవుతాయని ఆయన అన్నారు. ఫీల్డ్ స్థాయిలో సిబ్బంది నిబద్ధతతో పనిచేసి నాణ్యమైన డేటా సేకరణకు కృషి చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారులు స్పెషల్ డ్రైవ్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ కార్యక్రమం ముగింపు దశలో ఉన్నందున దీనిని విజయవంతంగా పూర్తి చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.