ఇంద్రకీలాద్రిపై మూడంచెల భద్రత
ఇంద్రకీలాద్రిపై మూడంచెల భద్రత
తిరుమల తరహా భద్రత వ్యవస్థ
భక్తుల రద్దీ దృష్ట్యా కొత్త యాక్షన్ ప్లాన్
మొబైల్ ఫోన్లకు నో….
ఉచిత సేవలకు ప్రాధాన్యం…
భక్తుల రక్షణే తొలి కర్తవ్యం.
దుర్గ గుడి ఈఓ శీనా నాయక్
ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తరహాలో ‘మూడంచెల భద్రతా తనిఖీ వ్యవస్థ’ను అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడంతో పాటు ఆలయ భద్రతను మరింత పటిష్టం చేయడమే ఈ చర్యల లక్ష్యమని పేర్కొన్నారు. శనివారం ఇంజినీరింగ్, భద్రతా విభాగాల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించిన ఈవో, భద్రతా లోపాలకు ఏమాత్రం తావులేకుండా మూడు దశల్లో తనిఖీలు చేపట్టే విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇటీవల అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు ఆర్జిత సేవల టికెట్లకు డిమాండ్ అధికమవడంతో క్యూలైన్ల నిర్వహణ సవాలుగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో రద్దీ సమయాల్లో గందరగోళం నివారించేందుకు ప్రతి భక్తుడిని మూడు వేర్వేరు కేంద్రాల్లో తనిఖీ చేసిన తర్వాతే ఆలయ ప్రాంగణంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు తనిఖీ కేంద్రాల్లో వాటిని చూపించాల్సి ఉంటుందని, టిక్కెట్ లేని సామాన్య భక్తులకు సర్వదర్శనం ద్వారా నిరంతరాయంగా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

భద్రతా తనిఖీల్లో భాగంగా కొండ అడుగుభాగంలో మహామండపం, ఓం టర్నింగ్ ప్రాంతాల్లో తొలి అంచె తనిఖీలు నిర్వహిస్తారు. రెండో దశలో కొత్త రాజగోపురం మైక్ సెంటర్, చిన్న రాజగోపురం వద్ద టికెట్ల పరిశీలనతో పాటు నిషేధిత వస్తువుల తనిఖీ చేపడతారు. మూడో దశలో ప్రధాన ఆలయం వెనుక ఏర్పాటు చేసిన స్కానింగ్ కేంద్రాల్లో తుది తనిఖీలు పూర్తి చేసి భక్తులను గర్భగుడి దిశగా అనుమతిస్తారు. ఆలయ పవిత్రతను పరిరక్షించేందుకు భద్రతా కారణాల రీత్యా మొబైల్ ఫోన్లను ఆలయ ప్రాంగణంలోకి అనుమతించబోమని ఈవో స్పష్టం చేశారు.

భక్తులు తమ మొబైల్ ఫోన్లను డిపాజిట్ కౌంటర్లలో భద్రపరచాలని సూచించారు. మరోవైపు భక్తుల సౌకర్యార్థం ఉచిత సేవలను విస్తరించినట్లు తెలిపారు. వికలాంగులు, వృద్ధులు, చంటి పిల్లల తల్లుల కోసం ఉచిత బ్యాటరీ వాహనాల సంఖ్య పెంచినట్లు వెల్లడించారు. శారీరక ఇబ్బందులు ఉన్న భక్తులకు లిఫ్ట్ సౌకర్యం నిరంతరం అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
కొత్త భద్రతా వ్యవస్థ అమలుకు ప్రత్యేక శిక్షణ పొందిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని వినియోగించడంతో పాటు భక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు పెద్ద సంఖ్యలో సేవా వాలంటీర్లను నియమించనున్నట్లు తెలిపారు. భక్తుల రక్షణే దేవస్థాన ప్రథమ కర్తవ్యమని పేర్కొన్న ఈవో శీనా నాయక్, కొత్త మార్పులకు భక్తులందరూ సహకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు.
