గోదావరి–కృష్ణా నదుల అనుసంధానకర్త చంద్రబాబు

  • వర్షాలు లేకున్నా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు
  • 11 నెలల్లో పట్టిసీమ నిర్మాణం..
  • 13 లక్షల ఎకరాలకు సాగునీరు
  • విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసి కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. వర్షాలు లేని సమయంలోనూ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించిన దార్శనిక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు.

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని కృష్ణా–గోదావరి పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదికి ముఖ్యమంత్రి చంద్రబాబు వైభవంగా జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, తంగిరాల సౌమ్య, శ్రీరామ్ రాజగోపాల్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సీనియర్ ఐఏఎస్ అధికారి శశిభూషణ్ కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ మంత్రి దేవినేని ఉమ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణమ్మ చెంతకు చేర్చి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వర్షాలు లేని సమయంలోనూ డెల్టా రైతులకు నీరు అందించిన ఘనత చంద్రబాబుదేనని పేర్కొన్నారు.

11 నెలల్లో పట్టిసీమ.. 13 లక్షల ఎకరాలకు నీరు

రూ.1,300 కోట్లతో కేవలం 11 నెలల వ్యవధిలో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన దార్శనిక నాయకుడు చంద్రబాబు అని చిన్ని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీటి ప్రవాహం తగ్గిన సమయంలో పట్టిసీమ ద్వారా వచ్చే గోదావరి జలాలు కృష్ణా డెల్టా రైతులకు అండగా నిలిచాయని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు ఒక ప్రత్యేక బ్రాండ్ ఉందంటే అది ‘సీబీఎన్ బ్రాండ్’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేతుల మీదుగా గతంలో పులిచింతల, ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని, రాబోయే రోజుల్లో చింతలపూడి ప్రాజెక్టు కూడా పూర్తవుతుందనే ధీమా వ్యక్తం చేశారు.

గోదావరి–కృష్ణాను కలిపిన ఘనత చంద్రబాబుదే

కృష్ణా, గోదావరి జలాలను సమర్థంగా సద్వినియోగం చేసుకున్న నాయకుడు చంద్రబాబు అని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. దేశంలో గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని అన్నారు. రాష్ట్ర సాగునీటి అవసరాలను ముందుగానే అంచనా వేసి ప్రాజెక్టులను చేపట్టడం ఆయన దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు.

అమరావతే ఏకైక రాజధాని

అమరావతిపై విమర్శలు చేస్తున్న వారిపైనా ఎంపీ కేశినేని చిన్ని మండిపడ్డారు. గతంలోనే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారని, అయినా ఇప్పటికీ అదే విధానంతో అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అమరావతే ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారని పేర్కొన్నారు.

నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతం నుంచి చిలకలూరిపేట వరకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రభావం ఉంటుందని చెప్పారు. ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, చొరవ వల్లేనని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్లో ప్రజలంతా భాగస్వాములవుతున్నారని, విమర్శలు చేస్తున్న వారి మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.