సాంకేతికత ఎంత పెరిగినా ‘సంస్కృతే’ మన గుర్తింపు
- అన్నమయ్య సంకీర్తనల కళా వైభవం
- సంగీతం వ్యక్తిత్వ వికాసానికి మార్గం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ: “ఎంతటి ఆధునిక సాంకేతిక విప్లవం వచ్చినా, భావితరాలు గ్లోబల్ సిటిజన్స్‌గా మారినా.. మన సంస్కృతి, కళలే మన ఉనికికి ఆధారాలు” అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, కాకరపర్తి భావనారాయణ కళాశాల, అన్నమాచార్య భావన వాహిని సంయుక్త ఆధ్వర్యంలో డా. శోభారాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో కేబీఎన్ కళాశాలలో గురువారం నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అన్నమయ్య వారసత్వాన్ని భావితరాలకు చేరవేస్తున్న శోభారాజు
కేబీఎన్ కళాశాల కార్యదర్శి టి. శ్రీనివాసు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో, అన్నమయ్య వారసత్వ సంపదను నేటి తరానికి అందించడంలో డా. శోభారాజు టార్చ్‌బేరర్‌లా నిలిచారని కలెక్టర్ కొనియాడారు. సామాజిక మాధ్యమాల్లో రీల్స్, 30 సెకన్ల వీడియోల హడావుడిలో యువత ఏకాగ్రత దెబ్బతింటోందని, అలాంటి సమయంలో సంగీతం జీవితానికి అద్భుతమైన శిక్షణగా నిలుస్తుందని రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్‌పర్సన్ పొడపాటి తేజస్విని పేర్కొన్నారు.
సంగీతం సహనం, క్రమశిక్షణను పెంచుతుంది
సంగీతం కేవలం భక్తికో, పోటీ ప్రపంచంలో గెలవడానికో మాత్రమే కాదని, అది మనిషిలో సహనం, క్రమశిక్షణ, విలువలను పెంపొందిస్తుందని తేజస్విని తెలిపారు. “నది తన నీటిని తాను తాగదు.. చెట్టు తన పళ్లను తాను తినదు.. అలాగే శోభారాజు తన వద్దనున్న అన్నమయ్య సంకీర్తనల జ్ఞానాన్ని నిస్వార్థంగా నవతరానికి పంచుతున్నారు” అంటూ ఆమెను ప్రశంసించారు.గంగ వద్దకు వెళ్తే పవిత్ర గంగాజలం దొరికినట్లే, సంగీతంతో పాటు సంస్కారాన్ని నేర్పించే శోభారాజు వంటి మహానుభావురాలి వద్ద విద్యను అభ్యసించడం విద్యార్థుల అదృష్టమని తేజస్విని అన్నారు. ఇక్కడితో ఆగిపోకుండా ఈ విద్యను మరింత మందికి పంచాల్సిన బాధ్యత యువతపై ఉందని పిలుపునిచ్చారు.
కళలకు ప్రభుత్వం పెద్దపీట
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నాయకత్వంలోని ప్రభుత్వం కళలకు, కళాకారులకు పెద్దపీట వేస్తోందని ఆమె తెలిపారు. ప్రతి కళాకారుడి ప్రతిభను గుర్తించి, వారికి తగిన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
అన్నమయ్య పాటను ప్రపంచవ్యాప్తం చేయడమే లక్ష్యం
అన్నమయ్య సంకీర్తనలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడమే తన జీవిత లక్ష్యమని డా. శోభారాజు తెలిపారు. తన జీవితాన్ని శ్రీ వేంకటేశ్వరస్వామి స్వరసేవకే అంకితం చేశానని, ఆ సేవకు కావలసిన శక్తిని స్వామివారే ప్రసాదించారని పేర్కొన్నారు. అన్నమయ్య పాటలు పాడటమే కాకుండా, వాటిలోని జీవిత సందేశాలను ఆచరణలో పెట్టి శృతిబద్ధమైన జీవితాన్ని గడపాలని యువతకు సూచించారు.
గ్రంథాలు, చిత్రపటాల ఆవిష్కరణ
డా. శోభారాజు గాత్రం, ఆమె ఆలపించే అన్నమయ్య సంకీర్తనల భావరసోత్పత్తి భగవంతుడే భువిపైకి దిగివచ్చినట్లుగా అనిపిస్తుందని కేబీఎన్ కళాశాల కార్యదర్శి టి. శ్రీనివాసు అన్నారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్. మల్లిఖార్జునరావు రూపొందించిన అన్నమయ్య, శ్రీ వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని, కేబీఎన్ కళాశాల అధ్యాపకులు చలపతిరావు రచించిన ‘పద్యభారతి’ గ్రంథాన్ని అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్ కమిటీ పరిపాలన అధికారి డా. వి. నారాయణరావు, కేబీఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. కప్పగంతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

