ఫ‌స‌ల్ బీమాతో అన్న‌దాత‌కు ఆర్థిక ధీమా..

  • రుణగ్రహీతలు, రుణేతర రైతులు పథకాల‌ను సద్వినియోగం చేసుకోండి
  • త‌క్కువ ప్రీమియంతోనే ఆప‌త్కాలంలో అతి ఎక్కువ భ‌రోసా
  • ఎల్‌నినో నేప‌థ్యంలో బీమా ప‌థ‌కాల‌పై విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించండి
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆప‌త్కాలంలో అండ‌గా నిలిచే పంట బీమా ప‌థ‌కాల‌ను అన్న‌దాత‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని.. రుణం తీసుకునే రైతులతో పాటు రుణేతర రైతులు కూడా తప్పనిసరిగా పథకాల్లో చేరాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. శుక్ర‌వారం కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న వ్యవసాయ, ఉద్యాన, సహకార, బ్యాంకింగ్, బీమా సంస్థల అధికారులతో స‌మావేశం జ‌రిగింది. ఎల్‌నినో ప్రభావం వంటి పరిస్థితుల నేపథ్యంలో పంట నష్టాల ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నందున రైతులకు ఫసల్ బీమాపై విస్తృత అవగాహన కల్పించాలని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ అధికారులను ఆదేశించారు.

ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, పున‌ర్నిర్మించిన వాతావ‌ర‌ణ ఆధారిత పంట బీమా ప‌థ‌కాల్లో చేరేలా ప్రోత్సహించాల‌న్నారు. ఇందుకు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు ప్ర‌త్యేక డ్రైవ్‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఖ‌రీఫ్‌-2026 సీజ‌న్‌కు జిల్లాలో ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న ప‌థ‌కం కింద వ‌రి, ఎర్ర‌మిర‌ప‌, మొక్క‌జొన్న‌, పెస‌ర పంట‌ల‌ను నోటిఫై చేయ‌డం జ‌రిగింద‌ని.. అదేవిధంగా పున‌ర్నిర్మించిన వాతావ‌ర‌ణ ఆధారిత పంట బీమా ప‌థ‌కం కింద ప‌త్తిని నోటిఫై చేసిన‌ట్లు వివ‌రించారు. వీటితో అతి త‌క్కువ ప్రీమియంతోనే క‌ష్ట‌కాలంలో అధిక ఆర్థిక భ‌రోసా ల‌భించ‌నుంద‌ని.. ఉదాహ‌ర‌ణ‌కు వ‌రికి ఎక‌రాకు బీమా మొత్తం రూ. 42,500 కాగా రైతు వాటా ప్రీమియం రూ. 850 చెల్లిస్తే స‌రిపోతుంద‌న్నారు.

వ‌రికి సంబంధించి ప‌థ‌కంలో న‌మోదుకు ఆగ‌స్టు 15వ తేదీ ఆఖ‌రు తేదీ కాగా ఎర్ర మిర‌ప‌, మొక్క‌జొన్న‌, పెస‌ర‌కు జులై 31 చివ‌రితేదీ అని తెలిపారు. ప‌త్తికి ఈ నెల 24వ తేదీలోగా న‌మోదు చేయించుకోవాల్సి ఉంటుంద‌ని వివ‌రించారు. పంట రుణం తీసుకున్న రైతుల‌కు రుణంతో పాటు అద‌నంగా బీమా ప్రీమియం కూడా మంజూరవుతుంద‌ని.. పంట రుణాలు తీసుకోని రైతులు న‌మోదుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు, కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు, జాతీయ పంట బీమా పోర్ట‌ల్‌, స్వ‌ర్ణ గ్రామం, త‌పాలా కార్యాల‌యాలను ఉప‌యోగించుకోవ‌చ్చ‌న్నారు.

పంట రుణాలు తీసుకోని రైతుల కోసం స్వీయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పించాల్సి ఉంటుంద‌ని సూచించారు. ప‌థ‌కాలకు సంబంధించిన స‌మాచారం, సందేహాల నివృత్తి కోసం స్థానిక వ్య‌వ‌సాయ అధికారుల‌ను సంప్ర‌దించాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. స‌మావేశంలో జిల్లా వ్య‌వ‌సాయ అధికారి డీఎంఎఫ్ విజ‌య‌కుమారి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, జిల్లా ఎక‌న‌మిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అధికారి డీవీ శివ‌రామ ప్ర‌సాద్‌, గ‌రిక‌పాడు కేవీకే శాస్త్ర‌వేత్త డా. ఐ.వెంక‌టరెడ్డి, ప్ర‌గ‌తిశీల రైతు యు.మాధ‌వ‌రావు, యూబీఐ సీనియ‌ర్ మేనేజ‌ర్ అబ్దుల్ స‌లామ్, టాటా ఏఐజీ ఇన్సూరెన్స్‌, ఇఫ్కో టోకియో జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ ప్ర‌తినిధులు తదిత‌రులు పాల్గొన్నారు.