సుజనా ఫౌండేషన్ సహకారంతో భారీ ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభం..
మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)….
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ ఉచిత మెడికల్ క్యాంపును శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సోమవారం పెనుగంచిప్రోలు పాత సినిమా హాల్ సెంటర్లోని ఆర్.కే. ఫంక్షన్ హాల్లో రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపులో ఏర్పాటు చేసిన వివిధ వైద్య విభాగాలను పరిశీలించి, వైద్య బృందం అందిస్తున్న సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, పరీక్షల నిర్వహణ విధానం, వైద్య నిపుణుల సేవలపై వైద్యులతో చర్చించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు ఈసీజీ, 2డి , రక్త పరీక్షలు, కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు తదితర సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. అలాగే అవసరమైన వారికి వైద్య నిపుణుల సూచనలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి ఈ క్యాంపు మంచి అవకాశంగా నిలుస్తోంది.
పేద మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా పెద్ద వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు.సుజనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుజనా చౌదరి సామాజిక బాధ్యతతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. గతంలో కూడా సుజనా ఫౌండేషన్ ద్వారా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని రైతులకు వర్షాల సమయంలో పంటలు దెబ్బతినకుండా రక్షించేందుకు పట్టాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం వంటి అనేక రంగాల్లో ఫౌండేషన్ చేస్తున్న సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని కొనియాడారు.
కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో మేలు చేస్తాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
క్యాంపుకు వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో వైద్య సేవలను వినియోగించుకోవడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చింతల సీతారామయ్య, జిల్లేపల్లి సుధీర్ బాబు, గజ్జి కృష్ణమూర్తి, కాకాని బ్రహ్మం, కొత్తపల్లి సతీష్, నల్లపునేని కొండ, ఏపూరి నాగశ్రీను, యనమదల నరసింహారావు, కొల్లిపాక బ్రహ్మం, దుడ్ల వినయ్, దివ్వెల వంశీ రమేష్ హాస్పిటల్స్ సిబ్బంది, సుజనా ఫౌండేషన్ సీఈఓ సుధా ఉపాధ్యాయుల, సుజనా ఫౌండేషన్ హెడ్ ఆపరేషన్స్ వీరమాచినేని కిరణ్, మెడికల్ ఇన్చార్జ్ వెంకటరమణ, సుజనా ఫౌండేషన్ ఇంచార్జ్ హరీష్, శంకర్ నేత్రాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
