Jind-Sonipat route | భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలుకు నేడు శ్రీకారం..

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశంలో హరిత రవాణా రంగానికి మరో కీలక అడుగు పడింది. భారత్‌లో తొలి హైడ్రోజన్ ఇంధన సెల్ ఆధారిత రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ‌ ప్రారంభించనున్నారు. హరియాణాలోని జింద్–సోనిపట్ రైల్వే మార్గంలో ఈ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దీంతో హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరనుంది.

ఈ రైలులో మొత్తం 10 ప్రయాణికుల కోచ్‌లు ఉన్నాయి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో రైలు స్వయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని నడుస్తుంది. ఫ్యూయల్ సెల్‌లో హైడ్రోజన్, ఆక్సిజన్ రసాయనిక చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి మాత్రమే ఉప ఉత్పత్తిగా విడుదల కావడంతో ఇది పర్యావరణహిత రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందింది.

ఈ రైలులో ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంది. గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపకల్పన చేయగా, సాధారణ ఆపరేటింగ్ వేగం గంటకు 75 కిలోమీటర్లుగా ఉంటుంది. రైలులో హైడ్రోజన్ లీకేజీ, మంటలు, పొగ, అధిక ఉష్ణోగ్రతలను గుర్తించే బహుళ భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

భారతీయ రైల్వేలు స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ హైడ్రోజన్ రైలు, కార్బన్ ఉద్గారాలను తగ్గించే దిశగా కీలక ముందడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో కూడా ఇలాంటి రైళ్లను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.