Tobacco Farmers Crisis | పొగాకు రైతులపై ఆర్థిక సంక్షోభం

Tobacco Farmers Crisis | పొగాకు రైతులపై ఆర్థిక సంక్షోభం

Tobacco Farmers Crisis | రైతులకు భారీ నష్టం – రూ.3,100 కోట్లకు చేరిన భారం
కంపెనీల గుత్తాధిపత్యంపై తీవ్ర ఆరోపణలు
నాణ్యత పేరుతో తిరస్కరణ – రైతుల్లో ఆందోళన
ప్రభుత్వ జోక్యం కోరుతూ అత్యవసర డిమాండ్

Tobacco Farmers Crisis | అమరావతి, ఆంధ్రప్రభ: పొగాకు ఈ ఏడాది రైతులను పగబట్టింది. ఆరుగాలం శ్రమించి సాగుచేస్తే కష్టాలు తీరకపోగా రెట్టింపయ్యాయి. అమ్మకానికి వేలం కేంద్రానికి తీసుకువస్తే ధర ఉసూరుమనిపిస్తోంది. దిక్కుతోచని రైతు నెత్తినోరు బాదుకుంటున్నాడు. ధర పతనం కావడం, నాణ్యత ముసుగులో సరుకును తిరస్కరించడం వంటి కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేలం కేంద్రాల వద్ద నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఈ నెల 1వ తేదీన గుంటూరులోని పొగాకు బోర్డు వద్ద ఆందోళన చేపట్టిన రైతుసంఘాలు, రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. భారతదేశంలో వాణిజ్య పంటల్లో పొగాకు సాగు అత్యంత కీలకమైనది. ముఖ్యంగా మన రాష్ట్రంలో పండే వర్జీనియా పొగాకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. అయితే, ప్రస్తుత (2025-26) సీజన్‌లో పొగాకు సాగు చేస్తున్న రైతాంగం తీవ్ర _సంక్షోభం_లో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనత, పొగాకు బోర్డు అధికారుల అలసత్వం, కొనుగోలు కంపెనీల సిండికేట్ రాజకీయంవల్ల రైతులు వేల కోట్ల రూపాయల నష్టాలను చవిచూస్తున్నారు.


ఇష్టారాజ్యంగా ధరల తగ్గింపు

వర్జీనియా పొగాకు పండించే వారిలో దాదాపు 90 శాతం మంది చిన్న, ఎన్‌కారులు, కౌలు రైతులే ఉన్నారు. ఈ తరహా పొగాకు ఏలూరు జిల్లాలో (ఉత్తరాది ఇసుక నేలలు), ప్రకాశం జిల్లాలో (దక్షిణాది నల్లరేగడి భూములు), నెల్లూరు జిల్లాలో (దక్షిణాది తేలిక నేలలు) ఎక్కువగా సాగుచేస్తారు. రాష్ట్రంలో 44 వేల మంది రైతులు 48 వేల బ్యారన్లు కలిగి ఉన్నారు. ఒక్కొక్క బ్యారన్‌కు 34 క్వింటాలు పొగాకు కొనుగోలుకు అనుమతి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 18 వేలం కేంద్రాలు ఉన్నాయి.

ప్రస్తుతం పొగాకు బోర్డు 2.05 లక్షల ఎకరాల్లో సాగుకు అనుమతినిచ్చింది. దీని ద్వారా దాదాపు 142 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి అవుతోందని అంచనా. అయితే అనుమతించిన పరిమాణం కంటే 87 మిలియన్ల కిలోల ఉత్పత్తి పెరిగిందనే సాకును చూపిస్తూ కంపెనీలు ధరలను ఇష్టారాజ్యంగా తగ్గించేస్తున్నాయి. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో నాణ్యమైన మొదటి గ్రేడ్ వర్జీనియా పొగాకు రూ.265, లో గ్రేడ్ పొగాకు రూ.205 మించి కొనటం లేదు. ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాలో మొదటి గ్రేడ్ కిలో పొగాకు రూ.250, లో గ్రేడ్ పొగాకు రూ.190లకు మించి కొనటం లేదు.


కంపెనీల గుత్తాధిపత్యం

పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో 100 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, అక్కడ 12 మిలియన్ల కిలోల మేర ఉత్పత్తి తగ్గింది. అయినప్పటికీ మన రాష్ట్రంలో ధరలు పడిపోవడం వెనుక కంపెనీల గుత్తాధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఐటీసీ, జీపీఐ, మహాలక్ష్మి వంటి దిగ్గజ పొగాకు కొనుగోలు కంపెనీలు తగ్గలేదు, కంపెనీల లాభాలూ తగ్గలేదు. కానీ రైతుల దగ్గరకు వచ్చేసరికి సిగరెట్లపై జీఎస్టీ 28 శాతం నుండి 40 శాతానికి పెరిగిందని, పశ్చిమాసియా దేశాలలో యుద్ధ వాతావరణం వల్ల ఎగుమతులు తగ్గాయని బూటకపు సాకులు చెప్తూ ధరలపై కోత విధిస్తున్నారు.


పెరిగిన ఉత్పత్తి ఖర్చు

ఏలూరు జిల్లాలో కిలో పొగాకు ఉత్పత్తి ఖర్చు రూ.360 అవుతుందని, రూ.400 అయితే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కిలో పొగాకు ఉత్పత్తి ఖర్చు రూ.300 పైనే అవుతుందని, కనీసం కిలో పొగాకు రూ.350 అయితే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఎకరానికి కౌలు, పెట్టుబడి భారం భారీగా పెరుగుతోంది. ప్రతి ఏడాది సాగు ఖర్చు పెరుగుతూ ఉండగా ధరలు మాత్రం పతనమవుతున్నాయి.


నాణ్యత సాకుతో తిరస్కరణ

పొగాకు వేలం ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా, మొత్తం ఉత్పత్తిలో కేవలం 5 శాతం మాత్రమే కొనుగోళ్లు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పొగాకు బోర్డు అధికారులు, కంపెనీలు సిండికేట్‌గా మారి నాణ్యమైన పొగాకును కూడా తిరస్కరిస్తున్నారు. ఒంగోలు, టంగుటూరు, కొండేపి, వెల్లంపల్లి కేంద్రాలలో 47 శాతం బేలులు తిరస్కరణకు గురవుతున్నాయి. పొదిలి, కనిగిరి, కందుకూరు, కలికిరి, డీసీపల్లి కేంద్రాలలో 40 శాతం తిరస్కరిస్తున్నారు. ఏలూరు ఏరియా పరిధిలో 43 శాతం బేలును నాణ్యత లేదని పక్కన పెడుతున్నారు. తిరస్కరించిన పొగాకు బేలును తిరిగి బ్యారన్‌కు తీసుకెళ్లడానికి రైతులకు అదనంగా బేలుకు రూ.2,000 వరకు ఖర్చవుతుండటం వారిని మరింత కుంగదీస్తోంది.


ప్రభుత్వాలు ఆదుకోవాలి: రైతుసంఘాలు

రైతులు ఇంతటి _ఆందోళన_లో ఉంటే, కేంద్ర పొగాకు బోర్డు కనీసం రూ.500 కోట్లు కేటాయించి పొగాకు కొనుగోలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నిరసనలు చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తీర్మానం పంపుతాం అనే హామీలకే బోర్డు పరిమితమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకోవడం దురదృష్టకరమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నిధి నుండి కనీసం రూ.500 కోట్లను కేటాయించి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నేరుగా పొగాకు కొనుగోలు చేయాలన్నారు. దీనివల్ల మార్కెట్లో పోటీ పెరిగి కంపెనీల గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట పడుతుందని, రైతులకు కనీస పెట్టుబడి అయినా దక్కుతుందని ఆయన తెలిపారు. పొగాకు రైతాంగాన్ని అప్పుల ఊబి నుండి, ఆత్మహత్యల ముప్పు నుండి కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతైనా ఉందని జమలయ్య కోరారు.