నిత్య అన్నదానానికి రూ.1 లక్ష విరాళం..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన సజ్జ రాధాకృష్ణ తన భార్య శోభారాణి, కుమార్తె మాలిని పేరున రూ.1,01,116 విరాళంగా అందజేశారు. దాత ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి కిషోర్ కుమార్ కు దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు రామబ్రహ్మం ద్వారా విరాళాన్ని అందజేశారు.

అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులకు అమ్మవారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు కలిసి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, విరాళం రసీదును అందజేసి సత్కరించారు. దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి భక్తులు అందిస్తున్న విరాళాలు అన్నప్రసాద సేవలను మరింత విస్తరించేందుకు ఉపయోగపడుతున్నాయని అధికారులు తెలిపారు.