కుమ్మరిపాలెంలో విషాదం

కుమ్మరిపాలెంలో విషాదం
- బైకుపై వస్తుండగా తాటిచెట్టు పడి ఇద్దరు మృతి
- ఇద్దరు మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి
కోడూరు, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా కోడూరు మండలంలో కుమ్మరిపాలెం గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి భారీగా వీచిన ఈదురుగాలుల ప్రభావంతో తాడిచెట్టు విరిగి రోడ్డు పై వెళ్తున్న బైక్ పై పడింది. బైక్ పై ప్రయాణిస్తున్న గరికపాటి మనోహర్ బాబు (30), చూటూరు శివరామకృష్ణ (28) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మిన్నంటింది.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది: ఎమ్మెల్యే
భారీ ఈదురు గాలులతో తాడిచెట్టు పడి కుమ్మరిపాలెంలో ఇద్దరు యువకులు దుర్మరణం వార్త దిగ్బ్రాంతి కలిగించిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మృతులు గరికపాటి మనోహర్ (30), చూడూరు శివరామకృష్ణ (28) కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్ధిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

