Mattapalli Temple | ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మట్టపల్లి


లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో పర్యాటక వసతులు, బోటింగ్ అభివృద్ధికి నిధులు
మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చించి నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Mattapalli Temple | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ పరిసరాల్లో పర్యాటక సౌకర్యాల అభివృద్ధి, బోటింగ్ కార్యకలాపాల ఏర్పాటుకు రూ.13 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మట్టపల్లి క్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చించి నిధుల మంజూరుకు కృషి చేసినట్లు తెలిపారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) అధికారులు క్షేత్రాన్ని పరిశీలించి అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్ల అంచనా వ్యయానికి పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ నిధులతో మట్టపల్లి ఆలయ పరిసరాల్లో భక్తులు, పర్యాటకులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టనున్నారు. ముఖ్యంగా బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి ద్వారా క్షేత్రానికి వచ్చే సందర్శకులకు మరిన్ని ఆకర్షణలు అందుబాటులోకి రానున్నాయి.

అభివృద్ధి పనులు పూర్తయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలగనున్నాయి. దీనివల్ల హుజూర్‌నగర్ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రాంతీయ అభివృద్ధికి, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆధ్యాత్మిక, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

మట్టపల్లి క్షేత్ర అభివృద్ధికి రూ.13 కోట్ల నిధులు మంజూరు కావడంపై స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తెలంగాణలో మరింత ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.