కేయూను రాజకీయాలకు దూరంగా ఉంచాలి

ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్: కాకతీయ యూనివర్సిటీని రాజకీయ వేదికగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను రెచ్చగొట్టి యూనివర్సిటీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీని సందర్శించిన ఎమ్మెల్యే అనంతరం మీడియాతో మాట్లాడారు. యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై గతంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి పలుమార్లు సమీక్షలు నిర్వహించారని తెలిపారు. సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల కోసం సమగ్ర డీపీఆర్‌ రూపొందించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన సందర్భంగా కూడా కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించి, అవసరమైన నిధులు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు వద్దు
గత పదేళ్లలో కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి ఎలా ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన మార్పులను విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు వాస్తవ దృష్టితో పరిశీలించాలని నాయిని సూచించారు. గతంలో తప్పుడు ప్రచారాలు, రాజకీయ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వారు ఇప్పుడు కూడా అభివృద్ధి పనులపై అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. యూనివర్సిటీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్‌పై ఎందుకు అభ్యంతరం?
కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు అంశాన్ని కొందరు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులతో సమావేశమై వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసినప్పటికీ, కొన్ని విద్యార్థి సంఘాలు అపోహలు కల్పిస్తున్నాయని ఆరోపించారు. యూనివర్సిటీలో సబ్‌స్టేషన్, బ్యాంకు, పోలీస్ స్టేషన్ తదితర అవసరాల కోసం గతంలో స్థలాలు కేటాయించినప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేయని వారు, ప్రస్తుతం విద్యార్థులకు ఉపయోగపడే ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) ఆమోదం పొందిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. మెస్, క్యాంటీన్ సమస్యలు, సిబ్బంది రెగ్యులరైజేషన్ వంటి అసలు సమస్యలపై దృష్టి పెట్టకుండా అభివృద్ధి పనులపై మాత్రమే ఆందోళనలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు.

మామునూరు విమానాశ్రయంపై బీఆర్‌ఎస్‌పై విమర్శలు
మామునూరు విమానాశ్రయ అంశంపై బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్యే ఖండించారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అవసరమైన అనుమతులు, సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి విమానాశ్రయ ఏర్పాటుకు ముందడుగు పడిందని తెలిపారు. గతంలో ముందుకు సాగని ప్రాజెక్టుకు ఇప్పుడు పురోగతి కనిపిస్తోందన్నారు.

యూనివర్సిటీ పాలనపై ప్రత్యేక దృష్టి అవసరం
కాకతీయ యూనివర్సిటీకి కూడా ఉస్మానియా యూనివర్సిటీ తరహాలో ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందని నాయిని అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని సమర్థవంతమైన పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. తనపై ఏవైనా ఆరోపణలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని, అయితే బ్రోకర్లు, మధ్యవర్తులు, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోనని హెచ్చరించారు. కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి కోసం విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, అధికారులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఇటీవల జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పుల్ల శ్రీనివాస్, హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్ పెద్దమల్ల శ్రీనివాస్‌లను ఎమ్మెల్యే నాయిని సన్మానించి అభినందించారు.