మతాన్ని రాజకీయాలకు వాడటం సిగ్గుచేటు: వల్లూరు భార్గవ్
- పాలనపై ఓట్లు అడిగే ధైర్యం లేదా?
- పవన్ కల్యాణ్ వెంటనే సమాధానం చెప్పాలి
- పూజారులు లేవనెత్తిన ప్రశ్నలకు బదులేది?
- విమర్శించే వారిపై దాడులు, బెదిరింపులు
- ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి విరుద్ధం
- సనాతన ధర్మం ఏ రాజకీయ పార్టీ సొత్తు కాదు
విజయవాడ, ఆంధ్రప్రభ: మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం తక్షణమే మానుకోవాలని, పాలన, పనితీరు, ప్రజలకు చేసిన సేవల ఆధారంగానే ఓట్లు అడగాలని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇన్‌చార్జి వల్లూరు భార్గవ్ డిమాండ్ చేశారు. విజయవాడలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి హిందూ పూజారులు, ఆధ్యాత్మిక గురువులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు.
మతం పేరుతో ప్రజల నుంచి ఓట్లు కోరడం ఎందుకు అవసరమైందని, పాలనపై ప్రజల ముందుకు వెళ్లి మద్దతు పొందే ధైర్యం లేదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా హిందూ పూజారులు, ఆధ్యాత్మిక గురువులు కూడా లేవనెత్తుతున్నారని పేర్కొన్నారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వారిని అవమానించడం, బెదిరించడం లేదా లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. సనాతన ధర్మం, హిందూ మతం, దేశభక్తి, జాతీయవాదం ఏ ఒక్క రాజకీయ పార్టీ సొత్తు కాదని వల్లూరు భార్గవ్ స్పష్టం చేశారు. విశ్వాసం ప్రజలదేనని, దానిని ఎన్నికల రాజకీయాలకు వినియోగించడం సరికాదన్నారు.
పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు..
దేవాలయ నిధులు, ప్రజల విరాళాలకు సంబంధించిన ఆరోపణలు ఉంటే వాటిపై పారదర్శకంగా, చట్టబద్ధంగా విచారణ జరిపి నిజానిజాలను వెలికితీయాలని కోరారు. బాధ్యతాయుతమైన పాలన, జవాబుదారీతనమే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించే ప్రతి పూజారి, గురువు, భక్తుడు, పౌరుడికి రాజ్యాంగం హక్కులు కల్పించిందని, అలాంటి గొంతులను రాజకీయ ఒత్తిళ్లు లేదా బెదిరింపులతో అణచివేయాలనే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వల్లూరు భార్గవ్ తెలిపారు. ప్రశ్నించే స్వేచ్ఛను గౌరవించడమే నిజమైన ప్రజాస్వామ్యమని ఆయన అన్నారు. కేవలం రాజకీయాలకు మాత్రమే స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ అంశాలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. అయోధ్య రామాలయంలో జరిగిన సంఘటనలకు సంబంధించి కూడా వెంటనే కూటమి నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు.
