బెల్ట్ షాపులపై నిషేధం..
వల్భాపూర్‌లో ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామ పంచాయతీ మద్యపాన నియంత్రణకు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో కొనసాగుతున్న బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
గ్రామ సర్పంచ్ పొనగంటి శ్వేత అధ్యక్షతన, ఉపసర్పంచ్ అంబాల అనిల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 18, 2026 నుంచి గ్రామ పరిధిలో ఎలాంటి బెల్ట్ షాపులు నిర్వహించరాదని తీర్మానంలో స్పష్టం చేశారు.
మద్యమే కుటుంబ సమస్యలకు కారణం..
ఈ సందర్భంగా సర్పంచ్ పొనగంటి శ్వేత, ఉపసర్పంచ్ అంబాల అనిల్ మాట్లాడుతూ.. గ్రామంలో వీధివీధికీ బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. మద్యానికి బానిసలవుతున్న కొంతమంది యువకులు, కుటుంబ పెద్దల కారణంగా కుటుంబ కలహాలు పెరుగుతున్నాయని, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మద్యం అలవాట్ల కారణంగా కొన్ని కుటుంబాల్లో విషాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో చిన్నపాటి గొడవలు, శాంతిభద్రతల సమస్యలకు కూడా అక్రమ మద్యం విక్రయాలు కారణమవుతున్నాయని తెలిపారు.
ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా
గ్రామ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వల్భాపూర్‌లో ఇకపై ఎలాంటి బెల్ట్ షాపులు నిర్వహించకూడదని పాలకవర్గం స్పష్టం చేసింది. నిషేధ నిర్ణయానికి బెల్ట్ షాపుల నిర్వాహకులు సహకరించాలని కోరింది. తీర్మానాన్ని ఉల్లంఘించి ఎవరైనా గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహించినట్లు గుర్తిస్తే, సంబంధిత వ్యక్తులపై గ్రామ పంచాయతీ తరఫున రూ.10 వేల జరిమానా విధించాలని నిర్ణయించింది.
స్వాగతించిన ప్రజలు
గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామ మహిళలు, ప్రజలు స్వాగతించారు. మద్యపాన నియంత్రణతో గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొని, కుటుంబాలు సంతోషంగా జీవించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మహిళలు కోరారు.
