భూ రీసర్వేకు సహకరించాలి
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, ఆంధ్రప్రభ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భూముల రీ సర్వే కార్యక్రమానికి రైతులు సహకరించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) కోరారు. భూముల డిజిటలైజేషన్, భూ సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఈ రీ సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని పైలట్ ప్రాజెక్టు గ్రామాలైన గండ్రవానిగూడెం, తిమ్మారెడ్డిగూడెం, కిష్టాపురం, ఉల్సాయిపాలెం, నరసాపురం గ్రామాల్లో శుక్రవారం భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే బీఎల్ఆర్తో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ పరిధిలోని ప్రతి సర్వే నంబర్లో ఉన్న భూములను సమగ్రంగా సర్వే చేయనున్నట్లు తెలిపారు. భూములకు సంబంధించిన వివాదాలు, సమస్యలను పరిష్కరించేందుకు వాస్తవ భూ వివరాలను నమోదు చేయడం రీ సర్వే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. భూముల వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయడం ద్వారా భవిష్యత్లో రైతులకు మరింత పారదర్శకమైన సేవలు అందుతాయని ఎమ్మెల్యే అన్నారు. రీ సర్వే ప్రక్రియ సక్రమంగా పూర్తయ్యేందుకు రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, తహసీల్దార్లు, గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, సైదా నాయక్, శంకర్ రెడ్డి, బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
