లాభసాటిగా వ్యవసాయం..

  • మండ‌లాలు వారీగా ప్ర‌త్యేక అవ‌గాహ‌న శిబిరాలు
  • ఉద్యాన పంట‌లు, పంట‌ల మార్పిడి ప్ర‌యోజ‌నాల‌పై నిర్వ‌హ‌ణ‌
  • అన్న‌దాతకు సాగును లాభ‌సాటిగా మార్చేందుకు ప్ర‌య‌త్నం
  • జిల్లాలో విజ‌య‌వంతంగా జ‌ల‌ధార‌-జ‌ల‌హార‌తి ప‌నులు
  • మంజూరైన మొత్తం ప‌నుల్లో ఇప్ప‌టికే 80 శాతం పూర్తి
  • అన్నింటా అభివృద్ధిలో స‌మ‌న్వ‌యానికి నిరంత‌ర స‌మావేశాలు
  • టీమ్ ఎన్‌టీఆర్ జిల్లాతో క‌లిసి జిల్లాను నెం.1గా నిలిపేందుకు కృషి
  • దిశ స‌మావేశంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

ఆంధ్రప్రభ, విజయవాడ: అభివృద్ధికి కీల‌క‌మైన ప్రాథ‌మిక‌రంగంలోని వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాల రైతుల‌కు సుస్థిర ఆదాయం ల‌భించేలా ఉపాధి హామీ ప‌థ‌కం అనుసంధానంతో ఉద్యాన‌పంట‌లు దిశ‌గా వెళ్ల‌డంతో పాటు పంట‌ల మార్పిడిపై మండ‌లాల వారీగా విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు, అత్యుత్త‌మ విధానాల‌ను ప‌రిచ‌యం చేయ‌నున్న‌ట్లు ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు.

జిల్లా అభివృద్ధి స‌మ‌న్వ‌యం, ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ (దిశ‌) స‌మావేశం గురువారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, జ‌గ్గ‌య్య‌పేట శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌), జెడ్‌పీ సీఈవో డా. జె.అరుణ తదిత‌రుల‌తో పాటు వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం, జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌, ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌, పీఎం-కిసాన్‌, ప్ర‌ధాన‌మంత్రి మాతృవంద‌న యోజ‌న, దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశ‌ల్య యోజ‌న త‌దిత‌ర కేంద్ర‌, రాష్ట్ర అనుసంధాన ప‌థ‌కాల అమ‌లుతీరుపై స‌మీక్షించి, భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై ఎంపీ దిశానిర్దేశం చేశారు.

అనేక ప‌థ‌కాలు కొత్త మ్యాన్యువ‌ల్స్‌తో స‌రికొత్త‌గా అమ‌లుకు సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని.. వీబీ-జీ రామ్ జీ ప‌థ‌కం జులై 1 నుంచి అమ‌లుకానుంద‌న్నారు. ఉపాధి హామీ ప‌థ‌కం అనుసంధానంతో జిల్లాలో జ‌ల‌ధార‌-జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మం కింద మంజూరైన దాదాపు 2,400 ప‌నుల్లో ఇప్ప‌టికే 80 శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌న్నారు. పీఎం కిసాన్ ద్వారా 22 విడ‌త‌ల్లో రూ. 494.75 కోట్లు మేర అన్న‌దాత‌ల‌కు ల‌బ్ధిచేకూరిన‌ట్లు పేర్కొన్నారు. రైతులు పంట పొలాల‌కు వెళ్లే రోడ్లు, ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో యానిమ‌ల్ హాస్ట‌ల్స్ ఏర్పాటు త‌దిత‌రాల‌పై దృష్టిసారిస్తున్న‌ట్లు తెలిపారు. యువ‌త‌కు నైపుణ్య‌భివృద్ధి, ఉపాధి క‌ల్ప‌న ప్రాధాన్య అంశాల‌ని, పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి కృషిచేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. గృహ నిర్మాణం, రైల్వే ప్రాజెక్టులు, వైద్య ఆరోగ్యం, సూక్ష్మ సేద్యం, మ‌హిళా శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి త‌దిత‌రాల‌కు సంబంధించిన ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌పైనా స‌మావేశంలో చ‌ర్చించారు.

సమావేశం అనంత‌రం ఎంపీ శివ‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌గ‌తిని నిరంత‌రం స‌మీక్షించేందుకు, భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌కు దిశ స‌మావేశాలను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. విజ‌య‌వాడలో ఎప్ప‌టిక‌ప్పుడు భారీ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుంటాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సార‌థ్యంలో ఒక‌వైపు వాటిని విజ‌య‌వంతం చేస్తూనే మ‌రోవైపు అధికారులు ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల అమ‌ల్లో ప్ర‌గ‌తికి కృషిచేస్తున్నార‌న్నారు. నిరంత‌ర ప్ర‌గ‌తికి వీలుగా ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో లంచ్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

జాతీయ ర‌హ‌దారులు, రైల్వేలకు సంబంధించిన ప్రాజెక్టుల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించి త్వ‌రిత‌గ‌తిన ప‌నుల పూర్తికి కృషిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. బుడమేరుకు సంబంధించి శాశ్వ‌త ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని.. అవి తుది ద‌శ‌లో ఉన్నాయ‌ని, గండి ప‌డిన ప్రాంతం వ‌ద్ద ప‌నులు పూర్త‌య్యాయ‌న్నారు. స‌మ‌స్య శాశ్వ‌త ప‌రిష్కారానికి మాన‌వ‌తా దృక్ప‌థంతో ముందడుగు వేస్తూ అంద‌రు క‌లిసి అంద‌రూ ఆనందంగా ఉండేలా కార్యాచ‌ర‌ణ ఉంటోంద‌న్నారు. స‌మ‌ష్టిగా ప‌నిచేస్తూ జిల్లాను నెం.1గా నిలిపేందుకు కృషిచేస్తున్న‌ట్లు ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. స‌మావేశం సంద‌ర్భంగా మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో బాలామృతం ప్ల‌స్ పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించి.. బాలామృతం కిట్ల‌ను అంద‌జేశారు. టాటా ట్రస్టుల జిల్లా ప్రాజెక్టు అధికారులు డి.శ్రీనివాసులు, టి.రంగారావు, ఐసిడిఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం తదితరులు పాల్గొన్నారు. స‌మావేశంలో దిశ క‌మిటీ స‌భ్యులు ఎం.గుర్నాథం, జి.రాజ్య‌ల‌క్ష్మి, జి.వ‌ర‌ప్ర‌సాద్‌తో పాటు వివిధ శాఖ‌ల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.