Bike Racing | ఆగం స్టంట్లతో రెచ్చిపోతున్న ఆకతాయిలు
Bike Racing | ఆగం స్టంట్లతో రెచ్చిపోతున్న ఆకతాయిలు
Bike Racing | తిక్కకుదర్చిన కదిరి పోలీసులు
Bike Racing | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆకతాయిగా మోటర్ సైకిళ్లతో రోడ్లపై తిరుగుతూ, ప్రజలకు భయబ్రాంతులకు గురిచేస్తున్న యువకుల స్పీడుకు కదిరి పోలీసులు బ్రేకులు వేశారు. ఈ నెల 6వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం, పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్ వీలింగ్, బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకుల పై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. తాను తవ్విన గోతిలో తానే పడినట్లు ఈ ఆకతాయిలు చేసిన బైక్ రేసింగ్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ద్వారా చివరకు పోలీసులు వీడియోల ఆధారంగానే వారిని అరెస్ట చేశారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఖాళీ రోడ్లు కనిపిస్తే చాలు చాలామంది యువత బైక్ రేసింగులు అంటూ ప్రజలను బెంబేలిత్తించే ఘటనలు ఈ మధ్య చాలానే జరుతున్నాయి. ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ జనాలను రోడ్లపై తిరగకుండా చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు తీసుకున్న చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

రీల్స్, లైక్స్ కోసం ప్రాణాలతో ఆటలు!
సోషల్ మీడియాలో లైక్స్, షేర్లు, ఫాలోవర్ల కోసం కొందరు యువకులు ప్రమాదకర స్టంట్లకు పాల్పడుతున్నారు. రోడ్లపై బైక్ రేసింగ్‌లు, వీలింగ్‌లు చేస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. చిత్ర విచిత్రంగా బైక్ రేసింగ్ చేస్తే సామాజిక మాధ్యమాల్లో లైక్స్, కామెంట్లు వస్తాయని ఆశిస్తున్నారు. వాటి కోసం ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారు. రేసింగుల కోసం మళ్లీ ఖరీదైన బైకులు కొనివ్వమని తల్లిదండ్రులను పీక్కుతింటున్నారు. సామాజిక మాధ్యమాల మోజులో పడి.. ఎన్ని ఎక్కువ లైకులు వస్తే.. అంత ఫేమస్ అన్నభావనలో యువత పోటీపడుతున్నారు.

మహానగరాలు.. ఖాళీ రోడ్లు..
హైదరాబాద్ మహానగరంలో బైక్ రేసింగ్ ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. అర్ధరాత్రి దాటింది అంటే చాలు యువకులు మాడిఫైడ్ ద్విచక్రవాహనాలు చేతపట్టి రోడ్లపై చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్స్, నాలెడ్జ్ సిటీ, ఐకియా పరిసరాలు, నెక్లెస్ రోడ్, టీ-హబ్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో అర్ధరాత్రిళ్లు ఇలాంటి రేసింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు ఈ ఉదంతాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న యువకులు మాత్రం అక్రమ రేసింగ్ చర్యలను మాత్రం ఆపడం లేదు. మరోపక్క ట్రాఫిక్ తక్కువగా ఉన్న సమయాల్లో పారిశుధ్య కార్మికులు తమ విధులు నిర్వహిస్తుంటారు. ఇలాంటి రేసింగ్ లతో వారి ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెడుతున్నారు.

పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిందే..
అక్రమంగా బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న వారిపై పోలీసుల కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమ రేసింగ్, స్టంట్స్ చేసిన దొరికిన వారికి కేవలం ఫైన్ తో సరిపెట్టడం వల్ల వారు మళ్లీ కొద్దిరోజులు ఆగిన తరువాత అక్రమ రేసింగ్ చేస్తూ రోడ్లపై దర్శనమిస్తున్నారు. మళ్లీ మళ్లీ తప్పులు చేస్తూ దొరికిన వారి బైకుల శాశ్వత జప్తు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి చర్యలు వారిలో మార్పును తీసుకురావచ్చు. బైకులను కనీసం 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు జప్తు చేస్తే ప్రయోజనం తప్పక ఉంటుంది. అక్రమ రైడింగ్‌కు పాల్పడే వారి లైసెన్స్‌ను తక్షణమే కనీసం ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేయాలి. తీవ్రమైన సందర్భాల్లో శాశ్వతంగా రద్దు చేయాలి. మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 184 (రాష్ డ్రైవింగ్) కింద నాన్-బైలబుల్ కేసులు నమోదు చేసి, జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. మైనర్లు అక్రమంగా బైక్ నడుపుతూ దొరికితే, కొత్త హిట్ అండ్ రన్/మోటార్ వాహన చట్టాల ప్రకారం వారి తల్లిదండ్రులకు రూ. 25,000 వరకు జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష విధించే నిబంధనను కఠినంగా అమలు చేయాలి.
CLICK HERE TO READ Malkajgiri Firing Husband Shoots Wife| మాట్లాడుకుందామని పిలిచి.. భార్యపై కాల్పులు
