Rs.8,749cr | ఇంధన ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రం

Rs.8,749cr | ఇంధన ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రం
భరోసా యాత్రల పేరుతో రైతులను మభ్యపెడుతున్న బీజేపీ
పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి
Rs.8,749cr | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తూ, ప్రజల అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు “రైతు ఘోస – బీజేపీ భరోసా” పేరుతో బస్సు యాత్రలు చేపట్టడం పూర్తిగా రాజకీయ డ్రామా అని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిజంగా తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ముందుగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో రైతులపై సాగు వ్యయం భారీగా పెరిగింది. ట్రాక్టర్లు, మోటార్లు, రవాణా ఖర్చులన్నీ పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కానీ రైతు సంక్షేమం గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యంలో బాయిల్డ్ రైస్ మంజూరు చేయడంలో, లేవీ రైస్‌కు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం సహకరించడం లేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పదేపదే కోరినా కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 53.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలగకుండా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. అదనంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం అనుమతి ఇవ్వలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్న 8లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేగంగా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 21కోట్ల గోనె సంచులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.8,749 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించిందన్నారు.
ఎన్నికల సమయంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, 60 సంవత్సరాలు దాటిన రైతులకు నెలవారీ పింఛన్లు ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. వ్యవసాయ చట్టాల పేరుతో దేశవ్యాప్తంగా రైతులను ఇబ్బందులకు గురిచేసి, 700 మందికి పైగా రైతుల ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చిన బీజేపీ ఇప్పుడు రైతులకు భరోసా ఇస్తామని చెప్పడం నమ్మశక్యం కాదన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, రైతులకు మాత్రం నయా పైస రుణమాఫీ చేయకపోవడం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు.
మొక్కజొన్న రైతులను అవమానపరుస్తూ క్వింటాకు కేవలం రూ.10 మాత్రమే MSP పెంచడం సిగ్గుచేటన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. రైతన్నలు బీజేపీ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులపై లాఠీచార్జీలు చేయించిన ఘటనలు దేశం చూసిందన్నారు. రైతుల బాధలను పట్టించుకోని బీజేపీ నేతలు ఇప్పుడు రైతు ప్రేమ గురించి మాట్లాడటం కపట నాటకమన్నారు. ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా రైతులు బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్నారు. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు.
