రోడ్డు భద్రతపై ప్రజల్లో పెరిగిన చైతన్యం
రోడ్డు భద్రతపై ప్రజల్లో పెరిగిన చైతన్యం
- 42శాతం వరకు తగ్గిన ప్రమాదాలు
- జీరో యాక్సిడెంట్ల మండలాలుగా ఇల్లంతకుంట, వీర్నపల్లి
- భద్రత పాటిద్దాం.. సురక్షితంగా ఉందాం..
- సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని జిల్లా ఎ స్పీమహేష్ బి. గితే తెలిపారు. ప్రజా పాలన- ప్రాగతి ప్రణాళిక కార్యాచరణలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు అరైవ్- అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటి ఫలితాలే గడిచిన సంవత్సరంలో మొదటి మూడు నెలలతో పోల్చుకుంటే రెండు నెలల్లో సిరిసిల్ల సబ్- డివిజన్ పరిధిలో 42శాతం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గడం మంచి పరిణామమన్నారు.
ముఖ్యంగా ఇల్లంతకుంట, వీర్నపల్లి మండలాల్లో జీరో ప్రమాదాలు నమోదు కావడం ప్రజల అవగాహనకు నిదర్శనంగా నిలిచిందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు గ్రామాల్లో ఉన్న రహదారి భద్రతా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలకు 80 శాతం ప్రధాన కారణాలు మద్యం సేవించి వాహనాలు నడపడం, ఓవర్ స్పీడ్స్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం, మైనర్ డ్రైవింగ్లోనన్నారు. ఈ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారిని గోల్డెన్ అవర్ (మొదటి గంట)లో ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం రూ.25వేల ప్రోత్సాహక నగదు అందజే స్తోందని, పథకానికి సంబంధించి రెండు దరఖాస్తులు అందగా, వాటిని జిల్లా కలెక్టర్‌కి పంపించామని, ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు అందేలా చూడటం జరుగుతుందన్నారు. ఇటీ వల రోడ్డు ప్రమాదాల్లో గురైన వాహనాలను ప్రదర్శనగా పెట్టారు. ఏ ఏ కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరిగాయో వివరించారు.
అనంతరం వాహనదారులకు, యువతకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు, క్రీడాకారులు, యువత ప్రజలతో కలసి రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్‌పై ప్రతిజ్ఞ చేశారు. ఈకార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేష్, ఎస్ఐలు నాగరాజు, ఉపేందర్, ఎంవీఐ వంశీధర్, ఏఎంవీఐ పృధ్విరాజ్ వర్మ, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు.
